- చెక్ డ్యామ్ లు, వాగులు, ఒర్రెలు నాలాల వద్ద ఓపెన్ బోర్లు
- అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్
- ఏటేటా పెరిగిపోతున్న నీటి వాడకం
- నిర్మల్ జిల్లాలోని 9 మండలాల్లో ప్రమాద ఘంటికలు
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో నీటి వినియోగం ఏటేటా పెరిగిపోతున్న కారణంగా భూగర్భ జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రెయిన్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు లేకుండాపోయి భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అర్బన్ సహా జిల్లాలోని 9 మండలాల్లో భూగర్భ జలాలు అత్యంత వేగంగా పడిపోతుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. 10 మీటర్ల లోతుకు నీటి నిల్వలు పడిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భూగర్భ నిల్వలు పెంచడంపై ఫోకస్ పెట్టారు.
కలెక్టర్‌తోపాటు భూగర్భ జల శాఖ అధికారులు సంయుక్తంగా ‘రీఛార్జ్ శాఫ్ట్’ అనే సిస్టంను తెరపైకి తెచ్చారు. చెక్ డ్యామ్‌లు, వాగులు, ఒర్రెలు, నాలాల వద్ద ఈ రీఛార్జ్ శాఫ్ట్లను ఏర్పాటు చేస్తున్నారు. చెక్ డ్యామ్‌ల లోపల వాటి బెడ్లకు ఆనుకొని 20 సెంటీ మీటర్ల కేసింగ్‌తో 100 అడుగుల లోతు ఓపెన్ బోరు బావులను తవ్వుతున్నారు. వీటి కారణంగా చెక్ డ్యామ్‌లు, నాలాలు, వాగులు, ఒర్రెల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతుండగానే భూ గర్భంలోకి నీరు చేరుకొని నేలంతా విస్తరిస్తుందని, ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా పెరిగే అవకాశాలుంటాయని అధికారులు చెప్తున్నారు.
ఇసుక నేలల్లో నే చెక్ డ్యాముల నిర్మాణాలు...
ఇప్పటివరకు నిర్మిస్తున్న చెక్ డాములు నల్ల రేగడితో పాటు మొరం భూములు, ఇసుక నేలల్లోనూ నిర్మిస్తున్నారు. అయితే నల్ల రేగడి భూముల్లో నిర్మిస్తున్న చెక్ డ్యామ్‌ల ద్వారా ఆశించిన ప్రయోజనం ఉండడంలేదని, అక్కడ నిర్మించే చెక్ డ్యామ్‌లలో నిల్వ ఉండే నీరంతా కొద్ది రోజుల్లోనే ఇంకిపోతోందని భూగర్భజల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. మొరం భూముల్లో నిర్మించే వాటితో కొంతమేరకు ప్రయోజనం ఇస్తున్నప్పటికీ ఇసుక నెలల్లోనే ఇక నుంచి చెక్ డ్యాంలు నిర్మించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇసుక నేలల్లో నిర్మించే చెక్ డ్యామ్ ల ద్వారా భూగర్భంలోకి నీరు ఎక్కువగా ఇంకుతోందని, దీని కారణంగా భూగర్భ జలాల్లో పెరుగుదల కనిపిస్తోందని చెప్తున్నారు.
9 మండలాల్లో సమస్య
జిల్లాలోని 9 మండలాలైన భైంసా, నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, ముథోల్, కుంటాల, సోన్, దిలావర్పూర్, సారంగాపూర్, లోకేశ్వరంలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్న ట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాలతోపాటు మిగతా మండలాల్లో కూడా భూగర్భ జలాల పెంపునకు రీఛార్జ్ శాఫ్ట్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
కలెక్టర్ సిఫారసుల మేరకే..
జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుకు ఇకనుండి రీఛార్జ్ శాఫ్ట్ విధానాన్ని అమలు చేయబోతున్నాం. కలెక్టర్ సిఫార్సుల మేరకు చెక్ డ్యామ్ లు, చిన్న వాగుల వద్ద రీఛార్జ్ శాఫ్ట్ పేరిట బోరుబావులను తవ్వి భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అనుకూలమైన ప్రదేశాలను గుర్తించేందుకు సర్వే చేస్తున్నాం.
- శ్రీనివాసరావు, డీడీ, భూగర్భ జల శాఖ, నిర్మల్ జిల్లా