నిల్వనీడలేదు..గుక్కెడు నీళ్లు లేవు

  • నిల్వనీడలేదు..గుక్కెడు నీళ్లు లేవు
  • ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కనిపించని వసతులు

ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఉపాధి హామీ కూలీ ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కూలీలు ఉదయం 7 నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు చేసి ఇండ్లకు వెళ్లిపోతుంటారు. అయితే ఉదయం 9 గంటల నుంచే జిల్లాలో ఎండల తీవ్రత కనిపిస్తోంది. దీంతో కూలీలు ఎండతాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.70 లక్షల జాబ్ కార్డులు ఉండగా అందులో 2.50 లక్షల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం నెల రోజులు గడుస్తున్నప్పటికీ 30 వేల మంది కూలీలు మాత్రమే పనులకు వెళ్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఉపాధి పనులు ప్రారంభించకపోవడంతో కూలీలు ఎదురుచూస్తున్నారు. 

రూల్స్​ కఠినం.. వసతులు శూన్యం

నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా పని ప్రదేశంలో కూలీల ఫోటోలను తీసి పోర్టర్​లో నమోదు చేస్తున్నారు. పథకంలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకు ఇది ప్రవేశపెట్టారు. దీనికి తోడు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కూలీ రేటును రూ. రూ. 250 ఉండగా రూ. 15 పెంచారు.  కూలీలకు కనీస వసతులు కల్పించడంలో మాత్రం  విఫలమవుతున్నారు.  పని ప్రదేశంలో తాగునీరు, మెడికల్ కిట్లు, టెంట్ తదితర వసతులను కల్పించాలి. కానీ గత ఐదేళ్లుగా ప్రభుత్వం వీటి ఊసే ఎత్తడం లేదు.   ఎండకాలంలోనే వ్యవసాయ పనులు అంతంత మాత్రంగానే ఉండటంతో ఉపాధి పనులు చేసేందుకు కూలీలు ఎక్కువగా వెళ్తుంటారు. చెరువుల్లో పూడిక   తీయడం, కాల్వలు,కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి పనులు చేయిస్తున్నారు. 

సదుపాయాలు కల్పించాలి

ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న  ప్రదేశంలో ఇప్పటి వరకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ప్రథమ చికిత్స లాంటి సదుపాయాలు కూడా లేవు. ఇంటి నుంచే తాగునీటిని తీసుకెళ్తున్నాం. రోజు పని కూడా ఉండటం లేదు. 

–మునేశ్వర్, సతీష్, గిర్నూర్ 

ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది..

ఉపాధి పని ప్రదేశాల్లో కల్పించాల్సిన తాగునీరు, టెంట్లు, మెడికిల్ కిట్లు గతంలోనే నిలిచిపోయాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే కూలీలకు అందజేస్తాం. ప్రస్తుతం ప్రతి రోజు 30 వేల మంది కూలీలు పనులు కల్పిస్తున్నాం.

-కిషన్, డీఆర్డీవో

ఉపాధిహామీ పనులు చేసి అలసిపోయిన కూలీలు  చెట్టు కింద కూర్చున్నారు. నార్నూర్ మండల కేంద్రానికి చెందిన 15 గ్రూపులకు సంబంధించిన 250 మంది కూలీలు శనివారం ఉదయం 8 గంటలకు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పని ప్రదేశంలో ఎండ  దృష్టిలో ఉంచుకొని టెంట్ కవర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎలాంటి సదుపాయం కల్పించకపోవడంతో అలసిపోయిన వారికి ఇలా చెట్టునీడే దిక్కైంది. ప్రభుత్వం టెంట్లు పంపిణీ చేయకపోవడంతో కొంత మంది చెట్ల నీడకు సేదతీరుతుండగా చెట్లు లేని ప్రాంతంలో కూలీలు ఎండలోనే అవస్థలు పడుతున్నారు.