కొలిక్కిరాని పోడు పంచాయితీ!

  •     రెవెన్యూ ఆఫీసర్ల పొరపాట్లే కారణం
  •     ఉన్న భూమి కంటే ఎక్కువ అసైన్డ్ పట్టాల జారీ
  •     ఫారెస్ట్ భూమితో కలిపి సాగు చేసుకున్న రైతులు
  •     హద్దులు పాతి అడ్డుకుంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు : రెవెన్యూ ఆఫీసర్ల పొరపాట్ల కారణంగా యాదాద్రి జిల్లాలో పోడు సమస్య పరిష్కారం కావడం లేదు. ఉన్న భూమి కంటే ఎక్కువ భూమికి అసైన్డ్‌ పట్టాలివ్వడం, ఫారెస్ట్ భూమిని కూడా రైతులకు చూపించడం ఇందుకు కారణమైంది.  పట్టాలు తీసుకున్న రైతుల్లో అటవీ భూమిని సాగు చేసుకుంటున్న వారు పోడు పట్టాల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ, వీరికి అధికారులు పట్టాలు ఇవ్వలేదు. పైగా, ఈ భూములకు హద్దులు పాతి వారిని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు. కొందరు రైతులపై కేసులు కూడా పెట్టారు.  దీంతో పోడు పంచాయితీ కొలిక్కి రావడం లేదు. 

ఉన్నది మూడు శాతమే

 యాదాద్రి జిల్లా 3795 కిలోమీటర్ల (స్టేట్​ లెవల్లో 3.38 శాతం) విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో అటవీ ప్రాంతం 118.63 (3 శాతం) కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 29,500 ఎకరాల్లో అటవీ ప్రాతం ఉండగా సంస్థాన్​ నారాయణపురం, చౌటుప్పల్​ (రాచకొండ ఏరియా) మండలాల పరిధిలో 12 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది.  ఇందులోనూ ఎక్కువ శాతం సంస్థాన్​నారాయణపురం మండలంలోనే పోడు పంచాయితీ నెలకొంది. 

ఎక్కువ భూమికి పట్టాలిచ్చిన రెవెన్యూ శాఖ

సంస్థాన్​నారాయణపురం మండలంలో రెవెన్యూ ఆఫీసర్లు తప్పిదాలు రైతులకు శాపంగా మారాయి. ఇక్కడ 7 వేల ఎకరాల అసైన్డ్​ భూమి ఉంటే.. 14 వేల ఎకరాలకు పట్టాలు జారీ చేశారు. అసైన్డ్​ భూముల పక్కనే ఉన్న ఫారెస్ట్​ భూములను కలిపి చూపించడంతో రైతులు రెండింటిని కలిపి సాగు చేస్తున్నారు. దీంతో జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాల ఫారెస్ట్‌ భూమి ఆక్రమణకు గురైందని ఆఫీసర్లు చెబుతున్నారు.  

ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఈ భూమి ఎవరి చేతుల్లో ఉందో ఆరా తీయడంతో పాటు తమ ఆధీనంలో ఉన్న భూములను ఎవరూ కబ్జా చేయకుండా హద్దులు పాతి.. మొక్కలు నాటుతున్నారు.  దీంతో రైతులకు, 
ఫారెస్ట్​ సిబ్బందికి మధ్య తరచూ గొడవలు జరుతున్నాయి. 

208 మందికి 150 ఎకరాల పంపిణీ

ఫారెస్ట్​ యాక్ట్​ ప్రకారం 13 డిసెంబర్​ 2005 వరకూ పోడు కొట్టి సాగు చేసుకున్న గిరిజనులకు ఆ భూమిపై హక్కు కలిగి ఉంటుంది. గిరిజనేతరులు మాత్రం మూడుతరాలకు చెందిన వారు సాగు చేసినట్టుగా ఉంటేనే హక్కు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం 2009–-10 ఫైనాన్స్​ ఇయర్​లో 400 ఎకరాలకు పైగా పట్టాలు ఇచ్చారు. 2022లో గత ప్రభుత్వం పోడు పట్టాలు ఇస్తామని ప్రకటించడంతో సంస్థాన్​ నారాయణపురం

చౌటుప్పల్, తుర్కపల్లి మండలాల్లో 2,130 మంది రైతులు 6,133 ఎకరాల కోసం అప్లై చేసుకున్నారు.  అధికారులు గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లను పరిశీలించి.. 208 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వారికి 2023 జూలై 3న పట్టాదారు పాసుబుక్స్​ ఇవ్వడంతో పాటు దాదాపు 150 ఎకరాలకు పైగా పంపిణీ చేశారు. ఇందులోనూ ఎక్కువ శాతం బీఆర్‌‌ఎస్ లీడర్లకే ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కబ్జాలో ఉన్నోళ్లకు పట్టాలిచ్చినం

2005 డిసెంబర్ 13 నాటికి కబ్జాలో ఉన్న వారికి పోడు పట్టాలు జారీ చేసినం. రైతులు కబ్జాలో ఉన్నారో లేదో పట్టించుకోకుండా రెవెన్యూ ఆఫీసర్లు కొంతమంది రైతులకు పట్టాలు జారీ చేశారు.  ఫీల్డ్‌‌లో భూమి లేకపోవడంతో వారికి పట్టాలు మాత్రమే మిగిలాయి. కొందరు ఫారెస్ట్​ భూములను ఆక్యూపై చేసుకొని పోడు భూముల కోసం అప్లై చేసుకున్నందున ఇవ్వలేదు. అవి పెండింగ్‌‌లో ఉన్నాయి.

- దేవి లాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చౌటుప్పల్

నా మీద ఆరు కేసులు పెట్టిన్రు 

 మాకు 5 ఎకరాల భూమికి పట్టా ఉంది.  మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూమిని ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు మా భూమి అంటున్నరు.  రెవెన్యూ అధికారులేమో అసైన్డ్ ల్యాండ్  అంటున్నారు. వారి మధ్య గొడవ కారణంగా మేము నష్టపోతున్నం. సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. అర్ధరాత్రి వచ్చి బోరు మూసి వేసి పోయిండ్రు. ఇప్పటికీ నాపై  6 కేసులు వరకు పెట్టారు. జైలుకు కూడా వెళ్లి వచ్చా.

- నల్లబోతు యాదయ్య, తుంబాయి తండా

ఒక్కరికే పట్టా ఇచ్చిన్రు

మా తండాలో 70 మంది రైతులు పోడు పట్టాలకు అప్లై చేసుకుంటే ఒక్కరికి మాత్రమే పట్టా ఇచ్చిన్రు. మాకు పట్టాలు ఇవ్వకపోగా ఫారెస్ట్ అధికారులు మేం సాగు చేసుకుంటున్న పొలాల్లో హద్దులు పాతుతున్నరు. మమ్మల్ని పంటలు సాగు చేసుకోనిస్తలేరు.

- దేవా, ఐదు దోనల తండా