మంచిర్యాల, వెలుగు : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీకి రెండు విడతలుగా 28 వేల జెండాలను పంపింది. కానీ మున్సిపల్ పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటిని పంచకుండా మున్సిపల్ ఆఫీసులో మూలకు పడేశారు.
పంద్రాగస్టు అయిపోయి వారం గడుస్తుండగా.. తీరిగ్గా సోమవారం వార్డులకు పంపించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని 24వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వేములపల్లి సంజీవ్ డిమాండ్ చేశారు.