రాష్ట్రం ప్రభుత్వ నిర్లక్ష్యంతో పోడు సమస్య మరింత తీవ్రమవుతోంది. పోడుభూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. దాన్ని నెరవేర్చకపోగా.. పోడు రైతులపై దాడులకు దిగుతూ వారి ఇండ్లను ధ్వంసం చేస్తోంది. తప్పుడు కేసులు బనాయిస్తూ.. వారిని జైలుపాలు చేస్తోంది. హరితహారం పేరిట పోడు భూములను లాక్కొని వారికి జీవనాధారం లేకుండా చేస్తోంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలో కోయపోచగూడలో ఇటీవల జరిగిన ఘటన ద్రిగ్బాంతి కలిగించింది. ఆ గూడెంలో ఆదివాసీలు తలదాచుకోవడానికి పోడు భూముల్లో గుడిసెలు వేసుకుంటే.. ప్రభుత్వం ఫారెస్ట్ఆఫీసర్లతో వారిపై దౌర్జన్యకాండ చేయించింది. ఆ భూమిని ఖాళీ చేయించే పేరుతో ఫారెస్ట్సిబ్బంది ఆదివాసీ మహిళల పట్ల ఆటవికంగా వ్యవహరించారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉంల్లంఘనే.
చట్టాలను కాలరాసి..
అటవీ సంపద మీద, భూముల మీద, నీటి వనరుల మీద ఆదివాసులకే సొంత హక్కు ఉండాలని అప్పట్లో ప్రభుత్వం వన్ ఆఫ్ సెవెంటీ, పెసా చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టాలని కాలరాస్తున్న ప్రభుత్వం.. గిరిజనులు, ఆదివాసీలకు కనీస హక్కులు కూడా దక్కనివ్వడం లేదు. కోయపోచగూడెం ఘటన ముమ్మాటికి కేసీఆర్ ఆదివాసీ వ్యతిరేక పాలసీలకు నిదర్శనమే. ఒకవైపు పోడు సాగు దారులకు హక్కుపట్టాలిస్తానని నమ్మించడం, మరోవైపు దాడులు, అరెస్టులు చేయించడం, మహిళలు, బాలింతలు అని చూడకుండా జైళ్లకు పంపడం కేసీఆర్ పాలన ద్వందనీతికి నిదర్శనం. 1/70 చట్టం, పెసా చట్టాలున్న అటవీ ప్రాంతాలన్నీ ఆదివాసేతరుల పరమైపోయాయి. అటవీ ప్రాంతంలో ప్రభుత్వమే ఒక పెద్ద భూస్వామిగా అవతరించింది. ఐదో షెడ్యూల్డు పరిధిలోనున్న ఆదివాసీ ప్రాంతాల్లో స్వయంపాలన ఏర్పాటును తుంగలో తొక్కి వారిని తరిమివేసే ఎత్తుగడలతో, అక్కడి సహజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలో భాగమే ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ దాడులు రాజ్యాంగం, చట్టాలకు, మానవ హక్కులకు విరుద్ధమని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరుగుతున్న దాడులే స్పష్టం చేస్తున్నాయి. ఆదివాసీ మహిళలపై దాడులు చేసిన అటవీ అధికారులు, సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి.
భూపంపిణీ ఏమైంది?
ధనిక వర్గాల వద్ద లెక్కకు మంచి ఉన్న లక్షల ఎకరాల భూములను ఏమీ చేయని ప్రభుత్వం.. పేదలకు గత ప్రభుత్వం అసైన్‌చేసిన భూములను దౌర్జన్యం చేసి గుంజుకుంటోంది. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూ పంపిణీ వాగ్దానం.. నీటి మీద రాతలుగానే మిగిలింది. రాష్ట్రంలో భూములన్నిటినీ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా అమ్మాలని నిర్ణయం చేసి అతి తక్కువ ధరలకు ఆధిపత్య కులాల వర్గాలకు అమ్ముతున్నది. పేద రైతులు, రెక్కలు లేని ఆదివాసీ లాంటి అణగారిన ప్రజలకు భూముల ఉండటాన్ని
జీర్ణించుకోవడం లేదు. ఖనిజ సంపద ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశం మొత్తంలో 90 రకాల ఖనిజాలు దొరుకుతున్నాయి. ఇందులో 90 శాతం మినరల్ బెల్ట్‌గా పిలిచే మధ్య ఇండియాలోని ఆదివాసీలు అత్యధికంగా నివసించే ఏడు రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి. మైకా ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానం, క్రోమైట్- బెరైటీలో రెండవస్థానం, బొగ్గు లిగ్నైలో మూడవ స్థానం, ఇనుము నాలుగవ స్థానం, బాక్సైట్ ఐదవ స్థానం, మాంగనీస్ ఏడో స్థానంలో ఉన్నది. మనదేశంలో లభించే ఖనిజాలన్నింటిలో అత్యధికంగా లభించేది ఇనుమే. పాలకులు దాన్ని అడ్డికి పావుశేరు లెక్కన సామ్రాజ్యవాద దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆ సంపదను అడవి నుంచి తవ్వి తీస్తూ.. సహజ న్యాయసూత్రాన్ని పాటించకుండా, ఆదివాసీల కోణంలో అభివృద్ధిని గురించిన ప్రస్తావన లేకుండా అన్యాయం చేస్తున్నారు.
ఆదివాసీల కోసం పోరాడాలె..
రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డ్ నిబంధనలను కాలరాసి అటవి ప్రాంత సహజవనరులను విచ్చలవిడిగా తరలించుకు పోవడానికి సీఎం కేసీఆర్ప్రభుత్వం ఆడుతున్న నాటకాలన్నీ ఈ ప్రాంతాన్ని షెడ్యూలేతర ప్రాంతంగా మార్చే కుట్రల్లో భాగమే. ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లోని డీనోటిపై చేసిన వేలాది ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాల్లో కలుపకుండా ఉండటం కుట్ర కొనసాగింపే. ఆదివాసీల జీవన విధానం సమాధి చేయడంతో పాటు వారి సంస్కృతులను విధ్వంసం చేసే కుట్ర జరుగుతోంది. వారి పక్షాన పోరాడేందుకు అందరూ ముందుకు రావాలి.
- పాపని నాగరాజు అధ్యక్షులు, కుల నిర్మూలన సమితి