
- రిక్కీ భుయ్ సెంచరీ వృథా
అనంతపూర్: దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌లో ఇండియా–డి ఆటగాడు రిక్కీ భుయ్ (113) సెంచరీ చేసినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండియా–ఎ186 రన్స్ తేడాతో విజయం సాధించింది.488 టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 62/1 తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా–డి రెండో ఇన్నింగ్స్‌లో 82.2 ఓవర్లలో 301 రన్స్‌కు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (41), సంజూ శాంసన్ (40), యష్ దూబే (37), సౌరభ్ (22), హర్షిత్ రాణా (24) పోరాడారు. తనుష్ కొటియాన్ 4, శామ్స్ ములానీ 3 వికెట్లు తీశారు. ములానీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇండియా బి,సి మ్యాచ్ డ్రా
పేసర్ అన్షుల్ కాంబోజ్ (8/69) 8 వికెట్లతో చెలరేగడంతో ఇండియా–బితో మ్యాచ్‌ను ఇండియా–సి డ్రా చేసుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 309/7 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన ఇండియా–బి తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 332 రన్స్‌కు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ (157 నాటౌట్) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
రాహుల్ చహర్ (18), నవ్‌దీప్ సైనీ (0), ముకేశ్ కుమార్ (4) ఫెయిలయ్యారు. విజయ్ కుమార్, మయాంక్ మార్కండే చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా–సి మ్యాచ్ చివరకు రెండో ఇన్నింగ్స్‌ను 128/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62), రజత్ పటీదార్ (42) రాణించారు. రాహుల్ చహర్ 2 వికెట్లు తీశాడు. అన్షుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.