తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి మొదట ఆశ్చర్యపోయానని చెప్పాడు దుల్కర్ సల్మాన్. మలయాళ నటుడే అయినా వరుస తెలుగు చిత్రాలతో టాలీవుడ్‌కు మరింత చేరువయ్యాడు. రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ చెప్పిన విశేషాలు.
“నేను నటించిన తొలి తెలుగు చిత్రం ‘మహానటి’ నుంచి ఇక్కడి ఆడియెన్స్ నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ‘సీతారామం’ చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆ ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు. ఇక వెంకీ అట్లూరి చెప్పిన ‘లక్కీ భాస్కర్’ కథ వినగానే కచ్చితంగా చేయాలనుకున్నా. బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్యతరగతి కుటుంబ కథగా చెప్పడం కొత్తగా అనిపించింది. నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్ర చేయాలి అనుకుంటున్నా. అది ఈ సినిమాతో నెరవేరింది.
నా దృష్టిలో ఇది వాస్తవ కథ. బ్యాక్‌గ్రౌండ్‌లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం అనేది కొత్త పాయింట్. నేను పోషించిన భాస్కర్ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి. ఈ కాన్సెప్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా వెంకీ చాలా బాగా తీశారు. మీనాక్షి చౌదరి మంచి కో యాక్టర్.
సితార సంస్థలో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. తెలుగులో హ్యాట్రిక్ విజయం సాధించడం ఆనందంగా ఉంది. అయితే ప్లాన్ చేస్తే విజయాలు రావు. మంచి కథలు చెప్పాలనుకుంటాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నా. అది కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’.