కేరళ కాలేజీలో సీనియర్ల పైశాచికత్వం..ప్రైవేట్ పార్ట్స్​కు డంబెల్స్ వేలాడదీశారు

కేరళ కాలేజీలో సీనియర్ల పైశాచికత్వం..ప్రైవేట్ పార్ట్స్​కు డంబెల్స్ వేలాడదీశారు
  • ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై వేధింపులు
  • ప్రైవేట్ పార్ట్స్​కు డంబెల్స్ వేలాడదీసిన వైనం
  • ఐదుగురు స్టూడెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు

కొట్టాయం: నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఐదుగురు సీనియర్లు కలిసి ముగ్గురు ఫస్టియర్ స్టూడెంట్లను దారుణంగా వేధించారు. హాస్టల్ రూంలో వాళ్లను నగ్నంగా నిలబెట్టి, ప్రైవేట్ పార్ట్స్ కు డంబెల్స్ వేలాడదీశారు. జామెట్రీ బాక్స్​లోని కంపాస్​తో పొడిచి చిత్ర హింసలు పెట్టారు. ప్రతివారం డబ్బులివ్వాలని బెదిరిస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారు. అలా మూడు నెలలపాటు నరకం చూపించారు. తమపై జరుగుతున్న ర్యాగింగ్​ను తట్టుకోలేక జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బుధవారం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొట్టాయం జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.

మందుకోసం ప్రతీవారం డబ్బులియ్యాల్సిందే..

తిరువనంతపురానికి చెందిన ముగ్గురు స్టూడెంట్లను గతేడాది నవంబర్ నుంచి సీనియర్లు ఐదుగురు కలిసి మానసికంగా, శారిరకంగా వేధింపులకు గురిచేశారు. మద్యం తాగేందుకు వాళ్లను బెదిరిస్తూ ప్రతివారం డబ్బులు వసూలు చేశారు. అందుకు నిరాకరించినప్పుడల్లా దాడి చేసేవారు. కంపాస్​తో పొడిచి గాయపర్చారు. అంతటితో ఆగకుండా గాయాలపై లోషన్ పూసేవాళ్లు. ఆ నొప్పిని భరించలేక జూనియర్లు కేకలు పెడితే.. వాళ్ల నోట్లో బలవంతంగా మందు బాటిల్ కుక్కేవాళ్లు. బయటకు పరిగెత్తకుండా కొన్నిసార్లు కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి వేధించేవాళ్లు. దీన్నంతటినీ ఫోన్​లో వీడియో తీసి.. భవిష్యత్తే లేకుండా చేస్తామని బెదిరించేవాళ్లు. ఇలా మూడు నెలలుగా అరాచకం కొనసాగుతుండగా ఓ రోజు మద్యం కోసం డబ్బులు ఇచ్చేందుకు ఈ ముగ్గురు ఫస్టియర్ స్టూడెంట్లు నిరాకరించడంతో సీనియర్లు తమ విశ్వరూపం చూపించారు. 

హాస్టర్ రూమ్​కు వెళ్లి ముగ్గురినీ బట్టలు లేకుండా నిలబెట్టారు. వాళ్ల పురుషాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. బయటికి చెప్తే కెరీర్​ను నాశనం చేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఈ వేధింపులను తట్టుకోలేక ఆ ముగ్గురిలో ఒకరు తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. దీంతో ముగ్గురూ కలిసి గాంధీనగర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసి మూడు నెలలుగా తమపై జరుగుతున్న ర్యాగింగ్ తీరును వివరించారు. కాగా, ఈ కేసులో సీనియర్ స్టూడెంట్లు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.