భద్రాచలం, వెలుగు: 29 వేల ఎకరాల గిరిజనుల భూములకు సాగునీరు, 12 వేల ఎకరాల తాలిపేరు ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్రతిపాదించిన దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి లిఫ్ట్ ప్రపోజల్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. లిఫ్ట్ పనులు చేపడతామని, బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆగమేఘాల మీద ఇరిగేషన్ ఇంజనీర్లు సర్వే చేసి ప్రపోజల్స్ రెడీ చేసి పెట్టారు. కానీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ హామీని మరిచిపోయింది. ప్రపోజల్స్ ఆఫీసుల్లో మూలుగుతుంటే ఎప్పటిలాగే గిరిజనుల పంటలు ఎండిపోతున్నాయి.
తలాపునే గోదారి ఉన్నా..
]దుమ్ముగూడెం మండల కేంద్రంలో బ్రిటిష్ కాలంలో కాటన్ దొర గోదావరిపై ఆనకట్ట కట్టారు. నిత్యం సమృద్ధిగా జలాలు పారుతూనే ఉంటాయి. అయితే గోదావరి పక్కనే ఉన్న ఆదివాసీలకు తాగునీరు అందని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే గిరిజన రైతులు ప్రగళ్లపల్లి వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న గూడేల వరకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే నాటి సీఎం వైఎస్సార్లిఫ్ట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రగళ్లపల్లి వద్ద లిఫ్ట్ కట్టి అక్కడి నుంచి బైరాగులపాడు, కమలాపురం, అంజుపాక, మహదేవపురం, దబ్బనూతల, కొత్తూరు, ఆర్లగూడెం, లచ్చిగూడెం, భీమవరం, మారాయిగూడెం, సింగవరం, గంగవరం, జిన్నెగట్టు, పత్తిపాక వరకు 21 కి.మీల మేర పైపులైన్ నిర్మించి సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
మిత్రుడి విజ్ఞప్తితో..
దుమ్ముగూడెం మండలం చినబండిరేవుకు చెందిన సాగి శ్రీనివాసరాజు వ్యవసాయంలో రాణిస్తున్నాడని తెలుసుకుని సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌కు పిలిపించుకున్నారు. అక్కడ నాలుగు రోజుల
పాటు ఉన్న శ్రీనివాసరాజు ఇక్కడి గిరిజనుల బాధలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హుటాహుటిన సీఎం సర్వేకు ఆదేశించారు. అసెంబ్లీలో కూడా బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు కూడా స్వయంగా ప్రకటన చేశారు. ఇరిగేషన్ ఇంజనీర్లు సర్వే చేసి రూ.645 కోట్లతో ప్రపోజల్స్ సిద్ధం చేశారు. అయితే ఆ ప్రపోజల్స్ ఆఫీసర్ల వద్దే
మూలుగుతున్నాయి.
సర్వే చేసిన మాట వాస్తవమే
ప్రగళ్లపల్లి లిఫ్ట్ కు సంబంధించిన సర్వే చేసిన మాట వాస్తవమే. ప్రపోజల్స్ కూడా సిద్ధం చేసినం. ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి రెడీ చేసి పెట్టినం.
- శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ, ఇరిగేషన్
కన్నీటి కష్టాలు తీరేదెన్నడో?
50 గిరిజన గ్రామాల రైతులు ఏళ్ల తరబడి వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నం. గోదావరి పక్కనే ఉన్నా సాగునీరు లేక పంటలు ఎండబెట్టుకుంటున్నం. ఈ కన్నీటి కష్టాలు ఎప్పుడు తీరుతాయో?
- యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి