కరీంనగర్​ మానేరు ఒడ్డున పశువుల కళేబరాలు డంపింగ్

కరీంనగర్​ మానేరు ఒడ్డున పశువుల కళేబరాలు డంపింగ్
  •      గుట్టలుగా ఎముకలు, కొమ్ములు 
  •     ఎండిపోయాక ఆయిల్ తయారీకి తరలింపు ?  
  •     కరీంనగర్ బైపాస్ రోడ్డును కమ్మేస్తున్న దుర్వాసన
  •     స్థానికులతో పాటు వాహనదారుల ఉక్కిరిబిక్కిరి
  •     వాన కురుస్తున్నా తగ్గని పొగ  

కరీంనగర్, వెలుగు: మాంసం కోసం కోసిన, చనిపోయిన పశువుల కళేబరాలను కొందరు కరీంనగర్ ​మానేరు నది ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డు వద్ద గుట్టలుగా డంప్ చేస్తున్నారు. మాంసం తీయగా మిగిలిన పశువుల ఎముకలు, తలలు, కొమ్ములు ఇక్కడ వదిలేస్తున్నారు. ఇవి కుళ్లిపోయి పురుగులు పట్టడంతో వాటి నుంచి వచ్చే దుర్వాసనతో కోతిరాంపూర్, ఆటోనగర్ తదితర ఏరియాల్లోని ప్రజలు, వ్యాపారులు, కరీంనగర్- పెద్దపల్లి బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

చికెన్, మటన్ వ్యర్థాలు డంపింగ్ యార్డులో పెద్ద ఎత్తున పోగవుతున్నాయి. తరచూ వర్షం కురుస్తున్నా ఈ డంపింగ్ యార్డులో పొగ మాత్రం తగ్గడం లేదు. ఇంకోవైపు జంతు కళేబరాలు వేసే ఏరియాలో కుక్కలు మాంసం కోసం గుంపులు గుంపులుగా తిరుగుతూ అటువైపు వెళ్లేవారిపై దాడికి దిగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఎండిపోయాక ఆయిల్ తయారీకి తరలింపు ?  

పశువుల ఎముకలు, తలలు, కొమ్ములను డంప్ చేసేందుకు డంపింగ్ యార్డు సమీపంలో ప్రత్యేకంగా ఓ షెడ్డే వేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ షెడ్డు మొత్తం పశువుల కళేబరాలతో నిండిపోవడంతో బయట నాలుగైదు చోట్ల కుప్పలుగా పోశారు. ఆరు బయట వేయడంతో ఎముకల మీది మాంసం ఎండలో పూర్తిగా ఎండిపోయాక.. వీటిని ఆయిల్ తయారీ కోసం గుట్టుగా రాత్రి పూట వాహనాల్లో ఇతర ప్రారంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇందుకోసమే డంపింగ్ యార్డులో కాకుండా సమీపంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో డంప్ చేస్తున్నట్లు తెలిసింది. పశువుల ఎముకల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్న ముఠాలు హైదరాబాద్ చుట్టపక్కల ఇండస్ట్రియల్ ఏరియాల్లో గతంలో అనేకం చిక్కాయి. ఇలాంటి ముఠాలే ఈ దందా సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

జంతు ‌కళేబరాలు మేం డంప్ చేయలేదు

జంతు కళేబరాలను మేం వేయలేదు. అవి ఎవరు వేశారో కూడా తెలియదు. సాధారణంగా మేమైతే అలాంటి వాటిని‌ డంపింగ్ యార్డ్ దగ్గరే జేసీబీతో గొయ్యి తీసి పూడ్చివేసి అందులోనే డీకంపోజ్ అయ్యేట్లు చేస్తాం. ఈ విషయం కొద్దిసేపటి క్రితమే మా దృష్టికి వచ్చింది. శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. 
స్వామి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్,  
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్

దుర్వాసన భరించలేకపోతున్నం.. 

ఇప్పటికే డంపింగ్ యార్డు పొగ వల్ల ఈ ఏరియాలో చాలా మందిమి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందిపడుతున్నం. దీనికితోడు కొన్నాళ్లుగా పశువుల కళేబరాలు ఇక్కడే డంప్ చేస్తున్నారు. ఇవి కుళ్లిపోయాక వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం. ఎప్పుడూ కర్చీఫ్ కట్టుకుని, మాస్కులు పెట్టుకుని ఈ ఏరియాలో తిరగాల్సి వస్తోంది. బొక్కలు అమ్ముకునేందుకే ఇక్కడ షెడ్డులో వీటిని ఎండబెడుతున్నారని తెలిసింది. మున్సిపాలిటీ వాళ్లు దీని గురించి పట్టించుకోవాలె.         
-శ్రీనివాస్, కోతిరాంపూర్, కరీంనగర్