హైదరాబాద్, వెలుగు: సిటీలోని భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్(కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిష్) ప్లాంట్లను జనం పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. వ్యర్థాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వెహికల్స్‌లో ప్లాంట్లకు పంపాలంటే వేలకు వేలు ఖర్చు అవుతోందని, దగ్గరలోని రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ సైట్వద్ద రోడ్లపై కుప్పులుగా పోస్తే జీహెచ్ఎంసీ అధికారులు ఫైన్లు వేస్తున్నారని అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. జీహెచ్ఎంసీ వెహికల్లో వ్యర్థాలు తరలించాలంటే టన్నుకు రూ.342 కట్టాల్సి ఉంది. అంత కట్టలేనివారు ప్రైవేట్ వెహికల్స్‌లో టన్నుకు రూ.100 ఇచ్చి రీ సైక్లింగ్ప్లాంట్లకు పంపిస్తున్నారు. అంత కూడా పెట్టలేనివారు ఇష్టమొచ్చిన చోట పారబోస్తున్నారు. దీంతో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడబడితే అక్కడ పారబోయకుండా ఉండాలనే ఉద్దేశంతో బల్దియా ఏర్పాటు చేసిన రీ సైక్లింగ్ ప్లాంట్లు పేద, మధ్య తరగతి వారికి ఉపయోగపడడం లేదు.
వ్యర్థాల నుంచి టైల్స్..
గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భవన నిర్మాణ వ్యర్థాలను సేకరిస్తున్న రాంకీ సంస్థ రీ సైక్లింగ్ ప్లాంట్లకు తరలించి మెటీరియల్‌ను వేరు చేస్తోంది. సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయిని తీస్తుంది. నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్‌లో 80 – 20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో రాంకీ సంస్థ పార్కింగ్ టైల్స్, ఫుట్ పాత్ టైల్స్ తయారు చేస్తోంది.
డైలీ 3 వేల టన్నులు..
సిటీలో రోజుకు దాదాపు 3 వేల టన్నులకు పైగా నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని అర్ధరాత్రి రోడ్ల వెంట, చెరువుల్లో అక్రమంగా డంప్ చేస్తున్నట్లు గుర్తించిన బల్దియా అధికారులు నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. నిర్మాణ వ్యర్థాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 1200 72659కి కాల్ చేసి చెబితే వెహికల్స్ పంపిస్తామని ప్రకటించారు. టన్నుకు రూ.342కు చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం జీడిమెట్ల, ఫతుల్లాగూడలో రాంకీ సంస్థ భాగస్వామ్యంతో డైలీ 500 టన్నుల వ్యర్థాలు తీసుకునేలా రెండు రీ సైకిలింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కాగా రాంకీ ప్లాంట్లకు ప్రతిరోజు నిర్ణయించిన దానికంటే ఎక్కువగానే వ్యర్థాలు వస్తున్నాయి. ప్లాంట్ల నుంచి నెలకు దాదాపు రూ.7 నుంచి 8 కోట్ల ఆదాయం రాంకీ సంస్థకు వస్తుంది. ప్లాంట్ల ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా పేద, మధ్య తరగతివాళ్లకు ఉపయోగపడడం లేదు. వెహికల్స్ టన్ను తరలింపు ధర తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. చిన్న ఇంటిని కూల్చినా వ్యర్థాలు తరలించాలంటే రూ.30 వేల వరకు ఖర్చు అవుతోందని జనం చెబుతున్నారు. లేకుంటే రాంకీ సంస్థ తయారుచేస్తున్న టైల్స్‌ను వ్యర్థాలు ఇచ్చిన వారికి తక్కువ ధరకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో రెండు ప్లాంట్లు?
సిటీలో ఇప్పటికే రెండు రీసైక్లింగ్ ప్లాంట్లు ఉండగా, చార్మినార్, సికింద్రాబాద్ జోన్లలో మరో రెండు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీటికి సంబంధించి చాన్నాళ్ల కిందే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కానీ ఇంతవరకు ఎలాంటి ఎలాంటి పురోగతి లేదు. టన్నుకు రూ.150 తీస్కోవాలిఎందుకూ పనికి రాని నిర్మాణ వ్యర్థాలను తరలించడం పెద్ద సమస్యగా మారింది. రోడ్లపై వేస్తే అధికారులు ఫైన్లు వేస్తున్నారు. రీ సైక్లింగ్ ప్లాంట్లు మరో నాలుగు ఏర్పాటు చేయాలి. అదే విధంగా టన్నుకి రూ.342 కాకుండా రూ.150 వసూలు చేయాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ బల్దియా సేవలు వినియోగించుకుంటారు.
- బాల్ రాజ్, ఖైరతాబాద్