ఏడాదిగా పెండింగ్​లో డంపింగ్ యార్డు పనులు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణ వాసుల చెత్త కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. డంపింగ్ యార్డు నిర్మాణానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ముందు స్థలం దొరకక ఇబ్బందులు పడగా, ఇప్పుడేమో స్థలం చూసి చదును చేసి నిధులు మంజూరు చేసినా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రాని దుస్థితి. దీంతో చెత్తంతా గోదావరి కరకట్టపై పోసి కాల్చుతున్నారు. ఈ పొగతో రాముడి దర్శనానికి వచ్చే భక్తులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలో 20 వేల కుటుంబాలు ఉన్నాయి. 18 ఆటోలు, 6 ట్రాక్టర్లు, ఒక డంపర్​ సాయంతో రోజుకు 15 టన్నుల చెత్తను పంచాయతీ సేకరిస్తోంది. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు డీఆర్​సీసీ ( డ్రై వేస్ట్ రీసోర్స్ కలెక్టింగ్​ సెంటర్) నిర్మించేందుకు కలెక్టర్​ అనుదీప్​ గతేడాది రూ.80 లక్షలు మంజూరు చేశారు. కానీ నేటికీ పనులు పూర్తి కాలేదు. 

కాంట్రాక్టర్​తోనే తిప్పలు..

రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలంలోని చెత్తను డా.పాల్ రాజ్​ ఇంజనీరింగ్​ కాలేజీ వెనక డంప్​ చేసేవారు. ఆ తర్వాత భద్రాచలం చుట్టూ ఉన్న ప్రాంతం ఏపీలో విలీనమైంది. దీంతో చెత్తను అక్కడ డంప్​ చేయకుండా అడ్డుకున్నారు. బూర్గం పాడు మండలం సారపాక-లోని మణుగూరు క్రాస్​రోడ్డు వద్ద స్థలం కేటాయించినా అక్కడి ప్రజలు అభ్యంతరం తెలిపారు. ఐటీడీఏ రోడ్డులోని మనుబోతుల చెరువు వద్ద స్థలం కేటాయిస్తే చుట్టు పక్కల వారు ఇక్కడ డీఆర్​సీసీ నిర్మాణం వద్దంటూ తిరగబడ్డారు. అయినా స్థలం చుట్టూ ఫెన్సింగ్​ వేసి పోలీస్​ ప్రొటెక్షన్​తో పనులు చేశారు. ఇక షెడ్ల నిర్మాణం మొదలు పెట్టాల్సి ఉండగా, రూ.80 లక్షలతో డీఆర్​సీసీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ పనులు చేయకుండా వదిలేశాడు. అడ్డంకులు తొలగినా పనులు పూర్తి చేయకపోవడంతో పట్టణ ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  

చెత్త సమస్య పరిష్కరించాలి


భద్రాచలంలో చెత్త సమస్యను పరిష్కరిం చేందుకు డంపింగ్​ యార్డు పనులు వెంటనే ప్రారంభించాలి. గోదావరి కరకట్టపై చెత్త వేసి కాల్చడంతో  రామాలయం పరిసరాల్లో పొగ కమ్ముకుంటోంది. భక్తులతో పాటు పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 
-
ఎర్రంరాజు బెహరా,  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

పనులు స్టార్ట్​ చేస్తాం..

మనుబోతుల చెరువు వద్ద డీఆర్​సీసీ పనులు నిలిచిన మాట వాస్తవమే. కాంట్రాక్టర్​ అగ్రిమెంట్​ ముగిసింది. అగ్రిమెంట్ పునరుద్ధరించి పనులు స్టార్ట్​ చేస్తాం. డంపింగ్​ యార్డ్​ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తాం.
- వెంకటేశ్వర్లు, ఈవో