బషీర్ బాగ్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల టైంలో బీసీ సీఎం పేరిట బీజేపీ కపట ప్రేమ చూపించిందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విమర్శించారు. తెలంగాణలోని బీసీలెవ్వరూ బీజేపీని నమ్మబోరని చెప్పారు. శనివారం కాచిగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మతపరమైన సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్న బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీ అన్నారు. కులగణన అంశాన్ని పక్కన పెట్టిందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని పోరాటం చేస్తున్న ఓబీసీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బీసీ బిల్లు పెట్టి 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. లోక్సభ ఎన్నికల్లో అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాల మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందన్నారు.