
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం-హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) 24 గంటల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నిరసన కనిపిస్తోంది. తాజాగా, ఈ నిరసన సెగ క్రీడలను తాకింది.
మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్యను నిరసిస్తూ కోల్‌కతాలో ఆందోళనలు జరుగుతుండడంతో ఆదివారం (ఆగస్టు 17) సాల్ట్ లేక్ స్టేడియంలో జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. డ్యురండ్ కప్‌లో భాగంగా ఆదివారం ఈస్ట్ బెంగాల్, మోహన్ బగన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. రెండూ బలమైన జట్లు కనుక స్టేడియానికి భారీగా అభిమానులు వస్తారని, ఆందోళనలు రేకెత్తితే కట్టడి చేయడం కష్టతరమని పోలీసులు నిర్వాహకులు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, శాంతి భద్రతల నేపథ్యంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. అంతేకాదు, ఈ టోర్నీలో కోల్‌కతా వేదికగా జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లను జంషెడ్‌పూర్(JRD టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్)కు తరలించనున్నట్లు సమాచారం.
🚨 𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 🚨#IndianOilDurandCup #PoweredByCoalIndia #DurandCup2024 #133rdEditionofDurandCup #ManyChampionsOneLegacy #IndianFootball pic.twitter.com/I9RyhW2maG
— Durand Cup (@thedurandcup) August 17, 2024
క్వార్టర్ ఫైనల్‌కు ఇరు జట్లు
17 సార్లు డ్యురండ్ కప్ ఛాంపియన్ మోహన్ బగన్ గ్రూప్ ఏ నుండి క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు, మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఈస్ట్ బెంగాల్ సైతం క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.