
- సోషల్ మీడియాలో నాపై తప్పుడు పోస్టులు పెట్టిస్తవా?
- పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
బెల్లంపల్లి, వెలుగు : ఓటమి భయంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులు తన ఫొటోను మార్ఫింగ్ చేసి థాయ్ మసాజ్ పేరిట అశ్లీలంగా సృష్టించి వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం దారుణమని కాంగ్రెస్ బెల్లంపల్లి అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్ మండిపడ్డారు. గురువారం బెల్లంపల్లిలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఓడిపోతాననే భయంతోనే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చిన్నయ్య దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి బెల్లంపల్లి నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలని నిలదీశారు.కాంగ్రెస్ పార్టీ పితామహుడైన గడ్డం వెంకట స్వామి అలియాస్ కాకాకు తాను పెద్ద కొడుకునని, ఇంత నీచానికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని వినోద్ స్పష్టం చేశారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న తనపై సోషల్ మీడియాలో అశ్లీలంగా ఉన్న ఫొటోలను సృష్టించి తప్పుడు పోస్టింగులు పెట్టించడం గర్హనీయమన్నారు.
తనపై దుర్గం చిన్నయ్య అనుచరులు చేసిన నిర్వాకంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పోలీసు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి బాధ్యుడైన వ్యక్తితో పాటు ప్రేరేపించిన చిన్నయ్యపైనా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో చిన్నయ్యపై పరువునష్టం దావ వేస్తాన హెచ్చరించారు. బెల్లంపల్లి ప్రజలు తాను చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇవ్వడంతో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు తనపై ఇలాంటి పోస్టింగ్ లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల టౌన్ ఇన్ చార్జి కేవీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.