ఆసిఫాబాద్, వెలుగు: దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఎం పార్టీ ఆసిఫాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శి దుర్గం దినకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బుక్ లెట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత రక్షణ, విద్య, పరిపాలన రంగాలపై దాడి చేస్తోందని, ప్రశ్నించే గొంతులపై అణిచివేస్తూ ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందన్నారు.
సామాజిక న్యాయన్ని కాపాడాల్సిన ప్రభుత్వ.. దళితులు, గిరిజనులపై దాడులు చేస్తున్నవారికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. బీజేపీ దుర్మార్గపు భావజాలాన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రతి కమ్యూనిస్టు కృషిచేయాలని కోరారు. ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో గులాబీ పార్టీ రూ.8 వేల కోట్ల అవినీతి చేసిందని ఆరోపించారు. ఆదిలాబాద్ పార్లమెంట్లో ఇండియా కూటమి మద్దతిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ ఏరియా కమిటీ నాయకులు, గోడిసెల కార్తీక్, గేడం టికానంద్, తిరుపతి, నిఖిల్, మాలశ్రీ, శ్రావణి, శ్రీకాంత్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు