
ఆసిఫాబాద్, వెలుగు : పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అమాయకత్వం, అవసరాన్ని ఆసరాగా చేసుకొని జిల్లావ్యాప్తంగా పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తూ కొన్ని దుకాణాలు, డీలర్లు సిండికేట్గా మారి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
మహారాష్ట్ర నుంచి వచ్చే రైతులకు అధిక ధరలకు అమ్ముతూ స్థానికంగా ఉన్న రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచడం లేదన్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. విత్తనాల వివరాలు, ధరను దుకాణదారులు నోటీస్ బోర్డుపై ఉంచాలన్నారు. అధిక ధరలకు పత్తి విత్తనాలను అమ్మే దుకాణదారుల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గుడిసెల కార్తీక్, పురుషోత్తం, టికానంద్, శ్రావణి పాల్గొన్నారు.