మెదక్/పాపన్నపేట, వెలుగు : ఏడుపాయలలోని దుర్గమ్మ ఆలయానికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా వసతులు మాత్రం సరిగా లేవు. ప్రతిసారి మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఇక్కడికి ఏడాది పొడువునా తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రతి ఏటా మహాశివరాత్రికి ఎనిమిది లక్షల మంది భక్తులు వస్తుంటారు.
కోట్లల్లో ఆదాయం...
కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయం, ఒడిబియ్యం సేకరణ టెండర్లు, లడ్డూ, ప్రత్యేక దర్శనం టికెట్లు, హుండీలో భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఏడుపాయల ఆలయానికి ఏటా దాదాపు రూ.6 కోట్లు సమకూరుతున్నాయి. అంతేగాక తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించాక ఏటా శివరాత్రి జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మంజూరు చేస్తోంది.
ఇవీ సమస్యలు..
ఆలయానికి కోట్లల్లో ఆదాయం వస్తున్నా భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం లేదు. దాతలు నిర్మించిన సత్రాలు, షెడ్లు 45 వరకు ఉండగా ఆదివారాల్లో, ఇతర సెలవు రోజుల్లో అవి భక్తులు బస చేసేందుకు సరిపోవడంలేదు. దీంతో ఖాళీ జాగాల్లో టెంట్లు వేసుకుని ఉండాల్సి వస్తోంది. లక్షల్లో భక్తులు వచ్చే జాతర సమయంలో సత్రాలు, షెడ్లు ఎవరికీ ఇవ్వరు.. దీంతో భక్తులు ఖాళీ ప్రదేశాల్లో, చెట్లకింద, బండల చాటున బస చేయాల్సి వస్తోంది. జాతర టైంలో తాగు నీటికి ఇబ్బందులు తప్పడం లేదు. నల్లాలు సరిగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక సత్రాల వద్ద మురుగు నీరు నిలిచిపోయి కుంటల్లా మారాయి. కొన్నిచోట్ల సత్రాల నుంచి వచ్చే మురుగు నీరు మంజీరా నదీ పాయలలోకి చేరి నీరు కలుషితమవుతోంది. జాతర నేపథ్యంలో పలు చోట్ల టెంపరరీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా పనులు ఇంకా పూర్తి కాలేదు. కొన్నిచోట్ల చెత్తాచెదారం పేరుకుపోయింది. స్నాన ఘట్టాల దగ్గర దుస్తులు మార్చుకునేందుకు సరైన వసతులు కల్పించడం లేదు. జాతర ప్రారంభానికి ఒకరోజు గడువు మాత్రమే ఉండగా పనులు పూర్తికాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.