బందిపోటు దొంగలు బీఆర్ఎస్​ లీడర్లే: దుర్గాప్రసాద్

ఖమ్మం టౌన్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో బందీపోటు దొంగలు లేరని, అసలైన బందిపోటులు బీఆర్ఎస్​లీడర్లేనని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ ఆఫీసులో సిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్లు బందిపోటు దొంగలంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కామెంట్​చేయడం హాస్యాస్పదమన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హత అజయ్ కు లేదని హితవు పలికారు. పార్టీ మార్పులు బీఆర్ఎస్సోళ్లు చేస్తే సంసారం, కాంగ్రెస్సోళ్లు చేస్తే వ్యభిచారమా అని నిలదీశారు.

స్థానిక మమత రోడ్డులో రెండు డివైడర్లు కట్టి, నాలుగు బల్బులు పెట్టి అభివృద్ధి చేశామంటూ అజయ్​బీరాలు పోతున్నాడని విమర్శించారు. ఖమ్మం సిటీలో వాన వస్తే వల వల, గాలి వస్తే గలగల అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. 20 రోజుల్లో బీఆర్ఎస్​నుంచి భారీగా వలసలు ఉంటాయని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు ఎక్కడ పార్టీ మారతారోనని అజయ్ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. కార్పొరేటర్లు మిక్కిలినేని మంజూలా లకావత్ సైదులు నాయక్, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రఫేదా బేగం కమర్తపు మురళి, నేతలు పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు.