ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తాం: పువ్వాళ్ల దుర్గాప్రసాద్

ఖమ్మం టౌన్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ ఓ తుంగ పూస లాంటిదని, ఎంత గట్టిగా తొక్కితే అంత పైకి  లేస్తదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు.  జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌‌‌‌గా శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.   దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..  మంత్రి కేటీఆర్ గాలి మోటార్‌‌‌‌లో వచ్చి గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో  డబ్బు ఎరగా చూపే  బీఆర్ఎస్ పార్టీ,  అభివృద్ధి పై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో ఆలోచించుకోవాలని చురకలంటించారు.  

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుందని,అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారన్నారు.  పదేళ్లలో బీఆర్‌‌‌‌ఎస్ సాధించిన ప్రగతి లిక్కర్, లీకుల స్కాంలేనని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.  సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, కార్పొరేటర్ మిక్కిలినేనీ మంజుల, పీసీసీ సభ్యుడు జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, కార్పొరేటర్లు లకావత్ సైదులు నాయక్, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, దొడ్డా నాగేశ్‌‌ తదితర నాయకులు పాల్గొన్నారు.