- బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి ఆమడ దూరం టూరిజం
- అభివృద్ధి కోసం రూ.5 కోట్లు ప్రపోజల్స్ పెట్టినా..
- రూపాయి విడుదల చేయని గత ప్రభుత్వం
- సూర్యాపేట జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కోసం
- రూ. 15 కోట్లతో ప్రపోజల్
- నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో పర్యాటక రంగానికి ఫండ్స్ ఇవ్వకపోవడంతో అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోయింది. సూర్యాపేట జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని గత బీఆర్ఎస్ సర్కారు హామీ ఇచ్చి మర్చిపోయింది. గేట్ వే ఆఫ్ తెలంగాణగా పేరొందిన జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కోసం రూ.5 కోట్లతో గతంలో అధికారులు ప్రపోజల్స్ పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాకపోవడంతో కార్యారూపం దాల్చలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూర్యాపేట జిల్లాకు చెందిన పటేల్ రమేశ్ రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. దీంతో టూరిజం అభివృద్ధిపై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జిల్లాలో పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం ఆయన రూ.15 కోట్ల ప్రపోజల్స్ పెట్టారు.
పర్యాటక కేంద్రాలకు నెలవు..
అటు ఆంధ్ర.. ఇటు తెలంగాణ రాష్ట్ర రాజధానికి మధ్య ఉన్న సూర్యాపేట జిల్లాలో చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో ఆధ్యాత్మిక ప్రదేశాలు, పురాతన కట్టడాలు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షస గుళ్లు, బౌద్ధ స్తూపాలు, కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ దేవాలయాలు, ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, కృష్ణ నది ఒడ్డున కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, పిల్లలమర్రి, ఫణిగిరి బౌద్ధ క్షేత్రాలు, పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయం, జాన్ పహాడ్ దర్గా, మూసీ రిజర్వాయర్ ప్రాంతాలు ఉన్నాయి.
జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం మొదటగా రూ.4.61కోట్ల ఫండ్స్ కావాలని.. 2017లో ప్రభుత్వానికి అధికారులు ప్రపోజల్స్ పంపించారు. వీటితోపాటు ఉండ్రుగొండ వద్ద మినీ ఫంక్షన్ హాల్, కోనేరు రివిట్ మెంట్, ఉండ్రుగొండ గుట్ట మీదికి రోప్ వే, ఉండ్రుగొండ గుట్టను ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి, ఫణిగిరి బౌద్ధ క్షేత్ర అభివృద్ధి, బుద్దవనం పార్కు, స్థానిక చెరువులో బోటింగ్, టూరిస్టులకు కావాల్సిన గెస్ట్ హౌస్, బౌద్ధ మ్యూజియం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. కానీ, 10 ఏండ్లలో పర్యాటక అభివృద్ధికి కేసీఆర్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
డెవలప్మెంట్ కోసం రూ.15 కోట్లతో ప్రపోజల్
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేశ్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. జిల్లా పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించారు. సద్దల చెరువు బ్యూటిఫికేషన్, ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధితోపాటు జిల్లాలోని మరికొన్ని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం రూ.15 కోట్లతో ప్రపోజల్స్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు.
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తా..
సూర్యాపేట జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నా.. వాటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. రూ.15 కోట్లతో సద్దుల చెరువు, ఉండ్రుగొండ, ఫణిగిరి బౌద్ధ క్షేత్రం వంటి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేశాం. జిల్లాను పర్యటకంగా అభివృద్ధి చేస్తాం. - పటేల్ రమేశ్ రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్