- ఎమర్జెన్సీ పేరుతో 3 నెలలు సిటీ వ్యాప్తంగా పనులు
- బిల్లులు అడిగితే వాటర్‌బోర్డు ఇస్తుందంటున్న బల్దియా
- తమ పరిధిలో చేయకుండా ఎందుకిస్తామంటున్న వాటర్‌బోర్డు
- తమకు అన్యాయం చేస్తున్నారంటున్న జెట్టింగ్ మెషీన్ల కాంట్రాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా ఫస్ట్‌వేవ్ టైంలో శానిటేషన్ పనులు చేయించిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు అందలేదు. జీహెచ్ఎంసీ అధికారులను అడిగితే వాటర్‌బోర్డు ఇస్తుందని, వాటర్‌బోర్డు అధికారులను అడిగితే జీహెచ్ఎంసీ ఇస్తుందని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. పనులు చేసి మూడేండ్లవుతున్నా ఇంతవరకు పైసలు ఇవ్వకపోవడం దారుణమని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఎమర్జెన్సీ పేరుతో దాదాపు మూడు నెలల పాటు 24 గంటలు పనిచేయించుకుని బిల్లులు ఆపడం అన్యాయం అంటున్నారు. వాటర్‌బోర్డు పరిధిలో పనిచేసే 40కి పైగా జెట్టింగ్ వెహికల్స్‌ను ఫస్ట్‌వేవ్ టైంలో జీహెచ్ఎంసీ వాడుకుంది. గల్లీగల్లీలో శానిటైజేషన్ చేయించింది. ఈ పనులకు గానూ మొత్తం రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గాక శానిటేషన్ పనులు ఆపేసిన అధికారులు బిల్లులు ఇయ్యకుండా దాటేస్తున్నారని మండిపడుతున్నారు.
ఖజానా ఖాళీ అంటూ..
జీహెచ్ఎంసీ ఖజానా ఖాళీ అవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. రెగ్యులర్‌గా జీహెచ్ఎంసీ పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకూ ఇదే సమస్య ఎదురవుతోంది. బిల్లుల కోసం ఇప్పటికే చాలాసార్లు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆ టైంలో ఎంతో కొంత ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. కానీ కరోనా టైంలో శానిటైజేషన్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం ఇయ్యాల్టికి కూడా ఇవ్వలేదు. ఆపదలో పనులు చేసిన తమకు ఎందుకు ఇవ్వరని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. మరోసారి పనులు చేయమంటే ఎలా చేస్తామని, పనుల కోసం చేసిన అప్పులు ఇప్పటికీ కడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ బోర్డులోనూ అదే పరిస్థితి
ఇప్పటికే జీహెచ్ఎంసీ ఉద్యోగులకు టైమ్ కి జీతాలు అందడం లేదు. ఒక్కో నెల10వ తేదీ వచ్చినా జీతాలు పడట్లేదని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో వాటర్ బోర్డు ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉండేలా ఉంది. ఇప్పటికే వాటర్‌బోర్డులోని చిన్నచిన్న కాంట్రాక్టర్లకు టైంకు బిల్లులు ఇవ్వడం లేదు. బడా కాంట్రాక్టర్లకు మాత్రమే వెంటనే అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలో అర్థంకాక ఫైనాన్స్ విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బోర్డుకు వస్తున్న ఆదాయంలో అత్యధికంగా మేఘ కంపెనీకి చెల్లించే బిల్లులకే సరిపోతుంది.
పనులు చేయించుకుని పైసలియ్యరా?
కరోనా టైంలో ఇండ్ల నుంచి బయటికి రావాలంటే భయమేసింది. అలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ముందుకొచ్చి శానిటేషన్ పనులు చేశారు. పనులు జీహెచ్ఎంసీ పరిధిలో చేయగా, బిల్లులు వాటర్ బోర్డు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. వాటర్ బోర్డు అధికారులను అడిగితే తమ పరిధిలో పనులు చేయకుండా ఎందుకు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి బిల్లులు ఇప్పిస్తే బాగుంటుంది. కాంట్రాక్టర్లు అప్పులు చేసి 24 గంటలూ శానిటేషన్ చేశారు.
- రాజలింగం, జెట్టింగ్ మెషీన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అడ్వయిజర్