- ఎమ్మెల్యే డర్టీ పిక్చర్
- కేటీఆర్ రాక నీ విజయానికి కాదు బాట
- బెల్లంపల్లి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
- తొలగించిన పోలీసులు
- మంచిర్యాల జిల్లాలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పలుచోట్ల 'బై బై చిన్నయ్య... గుడ్ బై చిన్నయ్య' పోస్టర్లు వెలిశాయి. బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గం పేరిట వెలిసిన ఈ పోస్టర్లలో ఎమ్మెల్యే చిన్నయ్య అవినీతి, అక్రమాలు, మహిళలపై వేధింపుల గురించి ప్రస్తావించారు. ఇటీవల ఓ ప్రైవేట్ డెయిరీ విషయంలో ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు వార్తలు మీడియాలో సంచలనంగా మారాయి. వాటి క్లిప్పింగ్లను పోస్టర్లలో ప్రింట్ చేస్తూ 'ఓ ఎమ్మెల్యే వలపు చేష్టలు... అభివృద్ధి కోసం, అవినీతి, భూకబ్జాల అంతం కోసం, మహిళలపై వేధింపులకు చరమగీతం పాడడం కోసం బైబై చిన్నయ్య గుడ్ బై చిన్నయ్య' అంటూ వెలిశాయి.
అలాగే 'బూతులు తిడుతూ నానా హంగామా... కేటీఆర్ రాక నీ విజయానికి కాదు బాట... బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు తలదించుకునేలా ఉంది నీ తీరు.. బైబై చిన్నయ్య', 'ఏ టీవీ ఛానల్, న్యూస్ పేపర్ చూసినా మీ రాసలీలలు, భూకబ్జాలు, మహిళలపై వేధింపుల కథలే దర్శనమిస్తున్నాయి. ఇక చాలు చిన్నయ్య... సెలవు చిన్నయ్య', 'ఎమ్మెల్యే డర్టీ పిక్చర్... ప్రజా ప్రతినిధిగా ప్రజాసేవ మరిచి మీకున్న బలహీనతతో బెల్లంపల్లి ప్రజల పరువు తీస్తివి.. బైబై చిన్నయ్య గుడ్ బై చిన్నయ్య' అంటూ పలుచోట్ల పోస్టర్లు వెలియడం కలకలం రేపింది.