
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై 8వ తేదీన వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్, హనుమకొండలో పోలీసులు అధికారులు ట్రాఫిక్ రూల్స్ తో పాటు పలుచోట్ల ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీసులు వెల్లడించారు.
మోదీ టూర్ షెడ్యూల్ ఇదే..
* శనివారం ఉదయం 7:35 గంటలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ హకీంపేటకు 9.25 గంటలకు చేరుకుంటారు.
* హకీంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా 10:15 గంటలకు వరంగల్‌లోని మామునూర్ ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా భద్రకాళి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
* ఆ తర్వాత ఆలయం నుంచి నేరుగా హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుని వ్యాగన్ పరిశ్రమ నిర్మాణానికి వర్చువల్‌గా భూమిపూజ చేయనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదిక నుంచి 11.45 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బహిరంగసభలో మాట్లాడనున్నారు.
* అనంతరం మధ్యాహ్నం 1.40కి తిరిగి హకీంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. డీజీపీ గురువారం పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రధాని పర్యటనకు ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, రోడ్లు, భవనాలు, రైల్వే తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
మోదీకి స్వాగతం పలుకుతూ నగరంలో ఇప్పటికే బీజేపీ నేతలు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సివిల్ పోలీసులతో నాలుగంచెల భద్రత కల్పించారు. పదివేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 30 వాహనాలతో నగరంలో పలు మార్లు ట్రయల్ రన్ చేపట్టారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సభా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 5 లక్షల జనసమీకరణే లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు.
మోదీ టూర్ నేపథ్యంలో పీఎం సెక్యూరిటీ చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‍పీజీ)తో పాటు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆఫీసర్లు ఇక్కడే మకాం వేసి బందోబస్త్ ఏర్పాట్లు చూస్తున్నారు. ఇప్పటికే ఎస్‍పీజీ బలగాలు సభాస్థలిని తమ కంట్రోల్ లోకి తీసుకున్నాయి. గురువారం (జులై 6న) గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీపీ విజయ్, పలువురు అధికారులతో సెక్యూరిటీపై రివ్యూ చేశారు. హనుమకొండ, వరంగల్ సిటీల చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ అంతా 144 సెక్షన్ విధించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.
రూ.6,100 కోట్ల పనులకు శంకుస్థాపన
రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.5,550 కోట్ల విలువ చేసే 176 కిలో మీటర్ల నేషనల్ హైవేలు ఇందులో ఉన్నాయి. 108 కిలో మీటర్లు మంచిర్యాల, వరంగల్ మీదుగా వెళ్లే నాగ్‌పూర్–విజయవాడ ఎన్‍హెచ్ 45 కారిడార్‍తో పాటు ప్రస్తుతం ఉన్న కరీంనగర్–వరంగల్ 68 కిలో మీటర్ల ఎన్‍హెచ్ 65 డబుల్‌లైన్ రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా డెవలప్ చేసే పనులకు భూమిపూజ చేయనున్నారు. దీంతోపాటు మరో రూ.500 కోట్లకు పైగా నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‍కు శంకుస్థాపన చేస్తారు.