పోలీస్ ఆఫీసర్లలో ట్రాన్స్ ఫర్ టెన్షన్!

  • బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పోస్టింగ్ లు పొందినోళ్లకు బదిలీ ఫీవర్ 
  • సిఫార్సు లెటర్ల కోసం నాటి ఎమ్మెల్యేలకు లక్షలు ముట్టజెప్పినట్లు ఆరోపణలు
  • సర్కార్ మారడం, కొత్త ఎమ్మెల్యేలు రావడంతో పలువురు ఎస్సైల నుంచి ఎస్పీల వరకు గుబులు
  • కొత్త ఎమ్మెల్యేలను, వాళ్ల అనుచరులను కాకా పట్టే పనిలో పోలీస్​ ఆఫీసర్లు 
  • కేసీఆర్ సర్కార్ లో ఇష్టారాజ్యంగా కేసులు, థర్డ్ డిగ్రీలు.. 

కరీంనగర్ పక్కనే ఉన్న ఓ నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓ నేత పోలింగ్ జరిగిన రోజే ఆ సెగ్మెంట్​లోని ఓ ఎస్సైకి ఫోన్ చేసినట్లు తెలిసింది. ‘ఎన్నికల్లో  బీఆర్ఎస్ కు వన్ సైడ్ సపోర్ట్ చేసివన్​.. కానీ నేనే కచ్చితంగా గెలవబోతున్నా..వచ్చేది మా ప్రభుత్వమే.. పెట్టె, బేడా సర్దుకో’ అని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సదరు లీడర్ గెలవడంతో పాటు కాంగ్రెస్ సర్కారే రావడంతో సదరు ఎస్సై తనకు ట్రాన్స్ ఫర్ తప్పదని ఫిక్స్ అయినట్లు తెలిసింది. 

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సరిగ్గా ఎన్నికలకు ఆర్నెళ్లు, ఏడాది ముందు పోస్టింగ్ పొందిన పోలీసాఫీసర్లలో ట్రాన్స్ ఫర్  టెన్షన్ నెలకొంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ ఎక్కడికి బదిలీ చేస్తారోనని పలువురు ఎస్సైలు, సీఐలు, ఏసీపీలు ఆందోళనకు గురవుతున్నారు. తమను లూప్ లైన్​లోకి పంపిస్తారని టెన్షన్ పడుతున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల హుకుంతో వారి ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేసిన కొందరు పోలీసాఫీసర్లయితే ఏకంగా లీవ్ లు పెట్టి వెళ్లిపోతున్నారు. మరికొందరు పోలీసులు తమ పోస్టింగ్  పదిలం చేసుకునేందుకు కొత్త ఎమ్మెల్యేలను, వాళ్ల అనుచరులను కాకా పెట్టే పనిలో పడ్డారు. అప్పటి ఎమ్మెల్యేల ఒత్తిళ్లతోనే తాము అలా వ్యవహరించాల్సి వచ్చిందని, అంతేతప్పా ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్ తమకు లేదని సర్దిచెప్పుకుంటున్నారు.

బీఆర్ఎస్ సర్కార్​లో అన్నీ రెకమండేషన్ పోస్టింగులే..

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ను మినిస్టర్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసించారు. ఎస్సై నుంచి ఏసీపీల దాకా పోలీస్ ​ఆఫీసర్లకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్నా, ఎక్కడికి ట్రాన్స్ ఫర్ కావాలన్నా ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్ కంపల్సరీ అనే రూల్ అనధికారికంగా అమలైంది. దీంతో లూప్ లైన్ లోకి వెళ్లకుండా పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కోసం పోలీసాఫీసర్లు లక్షల్లో ముట్టజెప్పేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందా, భూవివాదాలు ఎక్కువ ఉండే పోలీస్ స్టేషన్లకు ఫుల్ డిమాండ్ ఉండడంతో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్​లు తెచ్చుకున్నారనే విమర్శలున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్​ఐల నుంచి ఐపీఎస్ ఆఫీసర్ల వరకు కొందరు ఎక్కడా సర్వీస్ లో గ్యాప్ లేకుండా లా అండ్ ఆర్డర్ లో పోస్టింగ్​లు కొట్టేస్తే.. మరికొందరు మాత్రం ఏండ్ల తరబడి ట్రాఫిక్, ఏసీబీ, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, పోలీస్ ట్రైనింగ్ సెంటర్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలా లూప్ లైన్ లో ఉన్న పోలీసాఫీసర్లు ఇప్పుడు కొత్త సర్కార్​పై ఆశలు పెట్టుకున్నారు. పోలీస్ పోస్టింగ్స్ లో బీఆర్ఎస్ సర్కార్ మాదిరి సిఫార్సులకు తావుండొద్దని వారు కోరుతున్నారు. 

కేసీఆర్ సర్కార్​లో  ఇష్టారాజ్యంగా కేసులు, థర్డ్ డిగ్రీలు.. 

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట సంస్కరణలు తీసుకొచ్చినట్లు బయటికి చెప్పినప్పటికీ తమను ప్రశ్నించిన యువకులు, నాయకులపై బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టించారనే ఆరోపణలున్నాయి. ఇసుక మాఫియాను, భూదందాలను, అవినీతి, అక్రమాలను ప్రశ్నించినోళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే విమర్శలున్నాయి. అలాగే కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమకు పడని కాంగ్రెస్, బీజేపీ లీడర్లపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టించి వేధించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. లా అండ్ ఆర్డర్​లో పోస్టింగ్​ను కాపాడుకునేందుకు పోలీసాఫీసర్లు కూడా బీఆర్ఎస్ లీడర్లు చెప్పినట్లు వినడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలించే క్రమంలో 2017 జూలై 2న నేరెళ్లకు చెందిన భూమయ్య ఇసుక లారీ ఢీకొని చనిపోయాడు. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అప్పటి జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఇంటరాగేషన్​లో స్వయంగా పాల్గొన్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో అప్పటి సీసీఎస్ ఎస్సె రవీందర్​ను సస్పెండ్ చేసి, ఎస్పీ విశ్వజిత్ కంపాటిని హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ నేరెళ్ల బాధితులకు న్యాయం జరగలేదు. అంతేగాక కేటీఆర్ సిరిసిల్ల పర్యటన ఉంటే చాలు నేరెళ్ల బాధితులను బైండోవర్ చేసేవారు. ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్​  ప్రోద్బలంతో అప్పటి వరంగల్ సీపీ రంగనాథ్ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏబీవీపీ, బీసీ విద్యార్థి సంఘం నాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

పీహెచ్​డీ అడ్మిషన్లలో తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేసినందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీసీ రమేశ్​ ఒత్తిడితో సీపీయే స్వయంగా తమను చంపుతానని బెదిరించారని ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనలతోపాటు తెలంగాణ వచ్చాక ఏకంగా 13 లాకప్​డెత్​లు జరిగినట్లు పోలీస్​ రికార్డులు చెప్తున్నాయి. వీటిలో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మరియమ్మ, మెదక్ పోలీస్ స్టేషన్ లో ఖదీర్ ఖాన్ లాకప్ డెత్ లు రాష్ట్రాన్ని కుదిపేశాయి.

పోలీసాఫీసర్ల రాజీనామాలు, లీవులు.. 

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇంటెలిజెన్స్ వింగ్​కు చీఫ్ గా వ్యవహరించిన వెలమ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన మరుసటి రోజే తన పదవికి రిజైన్ చేశారు. ప్రభాకర్ రావు రాష్ట్రంలో ప్రైవేట్ సైన్యం నడుపుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన సంగతి తేలుస్తామని రెండేండ్ల క్రితమే పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

వెలమ సామాజిక వర్గానికి చెందిన టాస్క్ ఫోర్స్ ఓఎస్ డీ రాధాకిషన్ రావు కూడా రిజైన్ చేశారు. మూడేండ్ల క్రితం ఈయన పదవీ కాలం ముగిసినా బీఆర్ఎస్ సర్కార్  టాస్క్ ఫోర్స్​లోనే కొనసాగించింది. ఇటీవలే ఎన్నికల విధుల నుంచి రాధాకిషన్ రావును ఎన్నికల కమిషన్ తొలగించింది.

ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రెండు రోజులకే నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ ఈ నెల 19 వరకు లీవ్ లో వెళ్లారు. జూన్ నెలలో ఎమ్మెల్యే షకీల్ పై హత్యాయత్నం చేశారంటూ ముగ్గురు ఎంఐఎం లీడర్లపై కేసు నమోదు చేసి జైలుకు పంపడం, ఎన్నికల సమయంలోనూ ఎడపల్లి మండలంలో లాఠీఛార్జి, కౌంటింగ్ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫర్నిచర్ తరలింపు తదితర విషయాలు వివాదాస్పదమయ్యాయి.

అప్పటి ఎమ్మెల్యే షకీల్​కు అనుకూలంగా పనిచేస్తున్నారని సీఐ ప్రేమ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేషకీల్ ఓడిపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి గెలవడంతో సీఐ ట్రాన్స్ ఫర్ చేయించుకునేందుకు ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ పై కూడా ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మైకులో ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైనందున ఏసీపీ కూడా ట్రాన్స్ ఫర్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు..