బతుకులను గుల్ల చేస్తున్న ఆన్​లైన్​ జూదం

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలను ఎంత ప్రభావితం చేసిందో అలాగే ఈ ఆన్​లైన్​ జూదం విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూ వస్తున్నది. కరోనా కాలంలో ఆన్​లైన్​లో ఖాళీగా ఉన్న విద్యార్థులు, వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు అంతర్జాలంలో పార్ట్​ టైం ఉద్యోగాలు, మొబైల్ ఫోనుతో డబ్బులు ఎలా సంపాదించాలి అని గూగుల్​ను ఆశ్రయించడం ఎక్కువైంది. అలా వారందరి పూర్తి వివరాలు ఆయా వెబ్ సైట్​లకు చేరుతాయి. వారి పేరు, ఫోన్ నంబర్,  ఈ–మెయిల్ ఐడీ  వివరాలను ఒక వెబ్ సైట్ వాళ్ళు ఇంకొక వెబ్​సైట్ వారికి అమ్ముకుంటారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ గేమ్స్,  బెట్టింగ్ నిర్వహించే వారు, సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని వారి నంబర్లకు, టెలిగ్రాం, వాట్సాప్​లో శుభాకాంక్షలు తెలుపుతూ.. మీరు ఆన్​లైన్​లో డబ్బు సంపాదించే ప్లాట్ ఫామ్ కు ఎంపిక అయ్యారు అంటూ లింక్ పంపిస్తారు. లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ లేదా టెలిగ్రాం చాట్ లోకి వెళుతుంది. అక్కడ ఇతర దేశాల వ్యక్తుల పేర్లు, ఇతర దేశాల నంబర్లతో వారి వాట్సాప్ , టెలిగ్రాంలు ఉంటాయి. రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి, ఎలా ఆటలలో ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది, అనే పూర్తి వివరాలు అందిస్తారు. 100 రూపాయల నుండి మొదలుకొని ఎంత డబ్బు అయినా అందులో డిపాజిట్ చేయవచ్చు. ఇందులో కలర్ గేమ్, క్యాసినో, రమ్మి, తీన్ పత్తి ఇలా సుమారుగా 1500కు పైగా వెబ్ సైట్లు, అప్లికేషన్​లు ఉన్నాయి.

జూదం వ్యసనంగా..

ఈ ప్రయాణం అంతా మొదటగా కోల్పోయిన 100 రూపాయల కోసమే . ఇలాంటి గేమ్స్ లో చాలా రకాల ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయి. మా ప్లాట్​ఫామ్​కి మీ మిత్రులను ఆహ్వానిస్తే మీకు బోనస్ 100 నుండి 1000 వరకు వస్తుంది అంటూ ఉంటాయి. ఇలా అర్ధం పర్ధం లేని అనవసరమైన ఆఫర్లకు జీవితం లోని ఆశయాలను వదిలేసి పాక్షిక ఆనందానికి లోనయి మిత్రులను కూడ ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. వరంగల్​లో ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. నేను ఆన్ లైన్​లో డబ్బులు సంపాదిస్తున్నా నువ్వు కూడా ప్రయత్నించు అని తన మిత్రుడికి చెప్పగా అందులో సర్వస్వం కోల్పోయిన మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఈ ఆటలు మనుషులను ఉక్కిరి బిక్కిరి చేసి గంజాయి మత్తు లాగా, చాపకింద పాములాగా పాకుతునే ఉన్నాయి.  డబ్బులు అన్ని పోగొట్టుకున్నకా ఇక కొంచెం దూరం ఉండడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో టెలిగ్రాం, వాట్సాప్​లో వేరే మొబైల్ నంబర్లతో మెసేజ్​లు రావడం మొదలు అవుతాయి. ఇది కొత్త ప్లాట్ ఫామ్. ఇందులో మీరు 1000 ఇన్వెస్ట్​మెంట్​తో రోజుకు 200 నుండి 500 వరకు సంపాదించవచ్చు అని. కొన్ని గెలిచిన ఆనవాళ్ల బ్యాంకు ఖాతాకు చేరిన డబ్బుల జాబితాను స్క్రీన్ షాట్ రూపంలో చూపిస్తారు. వలలో పడేస్తారు. ఆన్​లైన్​ రమ్మీ ఆటలో ఒక ఉపాధ్యాయుడు కోటి రూపాయలు పోగొట్టుకొని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలో కోట్ల సంఖ్యలో వ్యక్తులు దీనిని వ్యసనంగా మార్చుకొని లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్నారు.

మద్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్​ను నిర్వహిస్తున్నది. కానీ ఈ జూదం విషయంలో ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఈ ఆటలను నిర్వహిస్తున్నారు, అనే విషయాలపై ప్రభుత్వానికి, పోలీసులకు ఈ సమాచారం అంతుచిక్కడం లేదు. నిమిషాల్లో లక్షల కోట్ల రూపాయలు ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక బ్యాంకు ఖాతా లోకి చేరుతున్నాయి. చైనా లాంటి దేశాలు భారత దేశంలో కొందరు సహకరించేవారిని  ఎంచుకొని తప్పుడు సమాచారంతో వారి కంపెనీని రిజిస్టర్ చేయించి టెలిగ్రాం లాంటి ఆన్ లైన్​ ప్లాట్ ఫామ్ ల్లో  ఇలాంటి ఆటలకు ఆకర్షితులు అయ్యే విధంగా ప్రమోట్ చేయిస్తుంది . చైనీస్ వ్యక్తులు, కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన దాడులలో ‘బీజింగ్ టీ పవర్ కంపెనీ’ గొడుగు కింద వివిధ కంపెనీలు ఆన్ లైన్​ జూదం నిర్వహిస్తున్నట్టు ఆరోపించిన పోలీసులు 1100 కోట్ల విలువైన లావాదేవీలను వెలికితీసినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ లావాదేవీలు లాక్ డౌన్ లో జరిగాయి అని తెలిపారు,ఆన్ లైన్ గేమ్స్ బారిన పడ్డ వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే పోతోంది. ఆన్​లైన్​ గేమ్​లు ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అందరూ అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వాలు  మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జరుగుతున్న ఆన్​ లైన్​ అనర్థాలే చెపుతున్నాయి.

ఆకర్షించే కలర్​ గేమ్​లు

కలర్ గేమ్స్ లో మూడు రంగులు ఉంటాయి మనం ఊహించిన రంగు 1 నిమిషం, 3 నిమిషాలు, 5 నిమిషాల సమయం లో ఆ రంగు ప్రత్యక్షం అయితే మనం పెట్టిన డబ్బులు రెండింతలు అవుతాయి, రమ్మీ , తీన్ పత్తి అనే ఆటలలో కార్డ్స్ తో డబ్బులు పెట్టి ఆడాల్సి ఉంటుంది. మనం పెట్టిన డబ్బులకు రెండు నుంచి పదింతల డబ్బు వస్తుంది. అలాగే క్యాసినో లో వందల రకాల ఆటలు రంగుల వస్తువులతో ఆడే ఆటలు ఉంటాయి. ఈ ఆటలు అన్నీ ఆ కంపెనీ ప్రవేశపెట్టిన సాఫ్ట్ వేర్​తో పని చేస్తాయి. ఆ ఆటలను ప్రవేశ పెట్టిన వారికి ఎలాంటి నష్టమూ ఉండదు. ఇలా మొదటగా 100 రూపాయలతో మొదలైన ప్రయాణం వేలు, లక్షల్లోకి చేరుతుంది. డబ్బులు 100 పోతే వాటిని రికవరీ చెయ్యడం కోసం 200, 500, 1000తో ప్రయత్నిస్తారు. ఇలా ఈ ప్రయాణం మన దగ్గర ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే వరకు సముద్రంలో పడవలా సాగుతూనే ఉంటుంది. తరువాత మిత్రుల దగ్గర అప్పు చెయ్యడం, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చెయ్యడం మొదలుపెడతారు. దీనికి తోడు కరోనా సమయంలో విద్యార్థులకు, ఇతరులకు ఆన్​లైన్​లో లోన్ సదుపాయం ఇవ్వడం పుట్టుకొచ్చింది. . ఆధార్ కార్డు, పాన్ కార్డు సహాయంతో లోన్లు తీసుకొని ఆన్ లైన్​ గేమ్స్ లో డబ్బులను డిపాజిట్ చేసి ఆడుతున్నారు.  ఉన్న డబ్బు, అప్పుగా తెచ్చుకున్న డబ్బు మొత్తం తుడుచుకుపోతుంది. దీని బారిన పడ్డ వారు లక్షలు కూడా డిపాజిట్ చేయడానికి వెనకాడటం లేదు.

-సాయి చరణ్ రామగిరి, కాకతీయ యూనివర్సిటీ