దద్దరిల్లిన పార్లమెంట్ ; రైతు సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మాటలయుద్ధం 

దద్దరిల్లిన పార్లమెంట్  ; రైతు సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మాటలయుద్ధం 

న్యూఢిల్లీ :  కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా పార్లమెంట్ దద్దరిల్లింది. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధంతో గురువారం లోక్​సభ వాయిదా పడగా.. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్ సభలో  రైల్వే సహాయ మంత్రి రవ్‌‌‌‌నీత్ సింగ్ బిట్టు, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌‌‌‌జిత్ సింగ్ చన్నీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతు సమస్యలు, రైతుల ఉద్యమం, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్(రవ్​నీత్​ సింగ్​ బిట్టుకు తాత) హత్యను చన్నీ ప్రస్తావించారు.

చన్నీ, కాంగ్రెస్  నేత సోనియాపై  బిట్టు వ్యక్తిగత విమర్శలు చేశారు.  దీంతో ఇరుపక్షాల మధ్య  మాటలయుద్ధంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశం కాగానే, రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్ సింగ్ మాట్లాడుతూ సభ్యులు అన్‌‌‌‌పార్లమెంటరీ కామెంట్లు చేస్తే తొలగించి చర్చను కొనసాగించాల్సిందిగా స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్​ ఆదేశించారు. ఆ తర్వాత కూడా సభలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగడంతో సభ మరునాటికి వాయిదా పడింది.  

రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో రాష్ట్రాలపై వివక్ష చూపిందని కాంగ్రెస్​ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బడ్జెట్​లో ఏపీ, బిహార్​ రాష్ట్రాలకు మాత్రమే నిధులు, స్కీంలు దక్కాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టినది కేవలం ‘కుర్సీ బచావో బడ్జెట్’ అని ఎద్దేవా చేశారు. అనంతరం ఖర్గే ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు  రాజ్యసభ నుంచి వాకౌట్​ చేశాయి.

అయితే కాంగ్రెస్‌‌‌‌ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కూడా అన్ని రాష్ట్రాల ప్రస్తావన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అన్నారు. కాగా, అంతకుముందు సభ ప్రారంభంకాగానే బడ్జెట్​లో రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడంపై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ తిరస్కరించారు.