నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. ‘గడప గడప’కి ప్రచారంలో భాగంగా బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీచైర్మన్ వివేక్ వెంకటస్వామి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అంతకుముందు.. గడప గడపకి ప్రచారంలో గట్టుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీరాజ్ ప్రచారం నిర్వహించారు. ఎన్నిక ప్రచారంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ఏండ్లుగా ఉద్యమం చేసినా రాని గట్టుప్పల్ మండలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఒక్కరోజులో వచ్చిందని లక్ష్మీరాజ్అందరికీ తెలియజేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వివరిస్తున్నారు.
ఇంటింటికీ బీజేపీ
నేటి నుంచి ఇంటింటి ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 10వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన బూత్ ఇన్చార్జిల మీటింగ్‌లో పలు అంశాలు చర్చకు వచ్చాయి. మునుగోడు నియోజకవర్గంలో తాజా పరిస్థితులు బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉన్నాయని, ముఖ్యంగా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరు గ్రామస్థాయిలో బలంగా వినిపిస్తోందని ఇన్చార్జిలు వివరించారు. కానీ, అభ్యర్థికి దీటుగా బీజేపీ కమలం గుర్తును ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున 157 గ్రామాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ కమలం గుర్తుపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
మారనున్న ప్రచార సరళి..
బూత్ ఇన్చార్జిల మీటింగ్ తర్వాత బీజేపీ ఎన్నికల ప్రచార సరళి పూర్తిగా మారనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు బూత్ ఇన్చార్జిలు ఇంటింటి ప్రచారంలో భాగంగా బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి కమలం గుర్తుపై ఫోకస్ పెట్టారు. నిజానికి రాజీనామా తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు ఊరూరా బలంగా వినిపిస్తున్నప్పటికీ బ్రదర్స్ ఇద్దరూ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, వెంకట్‌రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉండడంతో కొంతమంది, ముఖ్యంగా వృద్ధులు రాజగోపాల్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు భావిస్తున్నారు.
యువకులు, అర్బన్ ఏరియాల్లో కమలం గుర్తు పైన పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పటికీ రూరల్ ప్రాంతాల్లోనే ఈ సమస్య ఎదురవుతోంది. దీని వల్ల ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదం ఉండడంతో ప్రచార శైలిని మార్చాలని నిర్ణయించారు. నేటి నుంచి ఇంటింటి ప్రచారంలో భాగంగా అభ్యర్థి పేరుతోపాటు కమలం గుర్తు గురించి ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కమలం సింబల్ కనిపించేలా పెద్ద పెద్ద బ్రోచర్లు, స్టిక్కర్లు పంపిణీ చేయనున్నారు. కమలం గుర్తు ఉన్న ప్లకార్డులనూ ప్రదర్శిస్తూ ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు.