‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..తీగెలను ద్రెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ.. ’’అంటూ నిజామాబాద్ ఖిల్లా జైలు గోడలపై రాసి..రాచరిక పాలనపై అక్షర తూటాలు పేల్చిన కవి దాశరథి కృష్ణమాచార్య. పండ్లు తోముకునేందుకు ఇచ్చిన బొగ్గు ముక్కలతో జైలు గోడలపై స్ఫూర్తి గీతాలు లిఖించారు.
నిజామాబాద్, వెలుగు:
నిజాం కాలంలో ఎందరో ఉద్యమకారులను నిజామాబాద్ ఖిల్లా జైలులో బంధీలుగా ఉంచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాస్తున్నారంటూ చిత్రహింసలకు గురిచేశారు. ఖిల్లా జైలులో శిక్ష అనుభవించినవాళ్లలో దాశరథి కృష్ణమాచార్య, వట్టికోట అళ్వారుస్వామి వంటి వారు అనేక మంది ఉన్నారు. నాడు ఆంధ్ర మహాసభలో చురుకైన పాత్ర పోషిస్తున్న దాశరథిని, మరో 150 మందిని వివిధ కారణాలతో నిజాం పాలకులు అరెస్టు చేసి.. అత్యంత కట్టుదిట్టమైన నిజామాబాద్ ఖిల్లా జైలుకు తరలించారు. ఈ జైలులోని గదులు చాలక పోవడంతో ఆరుబయట వరండాలు, స్నానాల గదుల్లో కూడా ఉద్యమకారులను నిర్బంధించారు. అప్పటికే నిజాంకు వ్యతిరేకంగా తన కవిత్వంతో జనాన్ని చైతన్యపరుస్తున్న దాశరథి.. జైలు గోడల మధ్య కూడా అవిశ్రాంతంగా పాటలు, గేయాలు రాసేవారు. తానే స్వయంగా పాడుతూ తోటి ఉద్యమకారులను ఉత్తేజపరిచేవారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలును 15 ఏండ్ల క్రితం సారంగాపూర్‌కు తరలించారు. ప్రస్తుతం ఖిల్లాలోని రఘునాథ ఆలయం నిత్యపూజలతో వర్ధిల్లుతున్నది.
నిజాం పాలనపై పోరులో ఇందూరుతో పాటు ఆర్మూర్, వేల్పూర్, భీంగల్, ధర్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈక్రమంలో యువకులను ఉద్యమకారులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక వ్యాయామ శాలలు, కర్రసాము కేంద్రాలు ఏర్పాటుచేశారు. కుమార్‌గల్లిలోని భజరంగ్ వ్యాయామ శాల వందల మందిని కండలవీరులుగా తీర్చిదిద్దింది. ఇందులోని ముఖ్యులు గంజుల నారాయణ, గంజుల పోశెట్టి, విఠల్ దాస్, శంకర్ తదితరులు.. రజాకార్లను ఎదిరించారు. ఈ ఉద్యమంలో ఈ ప్రాంత వాసులు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. నల్ల నర్సింహారెడ్డి 1931లో రజాకర్ల చేతుల్లో మరణించారు. 1939లో సమాజ్ కార్యకర్త రాధాకిషన్ మొదాని అమరుడయ్యారు. ఆయన స్మృతికి చిహ్నంగా ఆర్యసమాజ్‌లో రాధాకృష్ణ పాఠశాలను, సుభాష్ నగర్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.