తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నోట్ల కట్టలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా చాలాచోట్ల కోట్లలో డబ్బును తరలిస్తున్నారు. నాయకులు ప్రలోభాలకు గురి చేయకుండా పోలీసులు చాలా చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలను చెక్ చేస్తున్నారు. తాజాగా పెద్ద అంబర్ పేట్ ఔటర్ రిండు రోడ్డు (ఓఆర్ఆర్) వద్ద భారీగా నగదు పట్టుబడింది.
రూ.2 కోట్ల నగదును మూటలుగా కట్టి కారులో తరలిస్తుండగా దొరికిపోయారు. పక్క సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు తనిఖీలు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారందరినీ విచారిస్తున్నారు. రూ.2 కోట్ల డబ్బు ఎవరిది..? ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు..? ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.2 కోట్ల నగదుతో పాటు కారును సీజ్ చేశారు.