ఎన్నికల కోడ్ అమలుతో పోలీసులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం పట్టుబడుతోంది.
హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు.
తాజాగా మియాపూర్ లో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. ఎలాంటి పత్రాలు లేకుండా 27 కేజీల బంగారు ఆభరణాలు,15కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. బషీర్ బాగ్ లోని ఓ నగల దుకాణం నుండి బంగారు,వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు చెప్పారు. మరో ఘటనలో మియాపూర్ పోలీసుల వాహనాల తనిఖీల్లో రూ.14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధనం చేసుకున్నారు.