మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ టూర్ సందర్భంగా ప్రతిపక్ష నేతల అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ టూర్ సందర్భంగా ప్రతిపక్ష నేతల అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 30న) ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రి టూర్ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్, కురవి, బయ్యారం మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న నాయకులను, కార్యకర్తలను బయ్యారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ.. బయ్యారం పోలీస్ స్టేషన్ లో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపారు. కేటీఆర్ పర్యటన వల్ల తమను అన్యాయంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమను వెంటనే విడుదల చేయాలని అందోళన చేపట్టారు. 

బలరాం నాయక్ హౌజ్ అరెస్ట్ 

మహబూబాబాద్ జిల్లాకు పోడు పట్టాల పంపిణీ  కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బలరాం నాయక్ ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. అఖిలపక్ష నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే వారిని విడుదల చేయాలని బలరాం నాయక్ డిమాండ్ చేశారు. 

పోడు పట్టాల అందజేత

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. రూ.5 కోట్లతో వెజ్‌, నాన్‌వెజ్‌, ఫ్రూట్స్‌, ఫ్లవర్‌ మార్కెట్లను ప్రారంభిస్తారు. గుమ్మడూర్‌లో 200 డబుల్‌బెడ్‌ రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో 24,181 మంది పోడు రైతులకు 67,730 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడే పోడు రైతులతో కలిసి మంత్రి కేటీఆర్‌ భోజనం చేస్తారు. ఆ తర్వాత తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.