గుజరాత్​ అల్లర్లపై పాఠం.. ఆరెస్సెస్​ కోపం

సిలబస్​లో మార్పులు చేర్పులకు సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ఏడాదికొక వివాదంలో చిక్కుకుంటోంది. తెలంగాణ ప్రొఫెసర్​ కంచె ఐలయ్య రాసిన రెండు బుక్స్​ని సిలబస్​ నుంచి తొలగించి గతేడాది వార్తల్లో నిలిచిన డీయూ.. ఈసారి గుజరాత్​ అల్లర్లను సిలబస్​లో చేర్చి మరో కొత్త గొడవకు తెర తీసింది.

గుజరాత్​లో గోద్రా రైలు దహనమే ఆ తర్వాత జరిగిన అల్లర్లకు కారణమనే వాదన ఉంది. ఈ గొడవల్లో వందల సంఖ్యలో జనం చనిపోయారని అంచనా. ఈ విషయాలను ఇన్​డైరెక్ట్​గా గుర్తుచేసేలా డిగ్రీ ఇంగ్లిష్​ ఆనర్స్​ బుక్​లో ఓ కథని ఢిల్లీ యూనివర్సిటీ ఈమధ్య చేర్చింది. ఆ రివైజ్డ్​ కరికులమ్​ డ్రాఫ్ట్​ని వర్సిటీ స్టాండింగ్​ కమిటీ వారం కిందట అప్రూవ్​ చేసింది. ఈ నిర్ణయం వివాదానికి దారి తీసింది. హిస్టరీ బుక్​లోని సూఫీ సాధువు అమిర్​ ఖుస్రోకి సంబంధించిన పాఠాలను ఎత్తేయటంపైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

గుజరాత్​ అల్లర్లపై శిల్పా పరాల్కర్​ అనే ఆథర్​ రాసిన ఆ కల్పిత కథ పేరు ‘మణీబెన్ అలియాస్​ బీబీజాన్​’. ఈ ఫిక్షన్​ స్టోరీలో మనూ అనే వ్యక్తిది లీడ్​ రోల్​. ‘గుజరాత్​ యువక్​ భజరంగ్​దళ్​’ సెక్రెటరీగా పనిచేసే ఆయన ఆరెస్సెస్​ నడిపే ఒక స్కూల్​లో ఫిజిక్స్​ సబ్జెక్ట్​ చెబుతుంటాడు. మనూ ఇంటికి ఓ రోజు ఒక ముస్లిం వచ్చి తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి అతని తల్లికి వివరిస్తూ విలపిస్తాడు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

‘వాళ్లు ఎవరినైతే చంపాలనుకున్నారో ఆ పేర్లు ఉన్న లిస్టులతోపాటు కిరోసిన్​ డబ్బాలను పట్టుకొని నా ఇంటికి వచ్చారు. నాకు విషయం అర్థమైంది. దీంతో నన్నేమీ చేయొద్దని వాళ్ల కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా. అయినా ఆ కిరాతకులు కనికరించలేదు. నా టీవీ షాప్​ను నిలువునా దోచుకున్నారు. అక్కడ ఉన్న సామగ్రిని ఇష్టమొచ్చినట్లు ధ్వంసం చేశారు. నా భార్య నఫీసాను, నన్ను వెనక గదిలో బంధించి, మా ఇంటి మీద కిరోసిన్​ పోసి నిప్పంటించారు’ అని చెప్పి ఆ ముస్లిం కళ్ల నీళ్లు పెట్టుకుంటాడు. ఇదీ ఆ స్టోరీ. ఈ కథను ఈ ఏడాది నుంచి 78కిపైగా యూజీ ప్రోగ్రామ్స్​ సిలబస్​లో చేర్చనున్నారు. ఈ డ్రాఫ్ట్​కి ఈ నెల 20న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వాల్సి ఉంది. ఆ కౌన్సిల్​ నిర్ణయమే ఫైనల్​. ఆ మీటింగ్​లో దీనికి ఓకే చెప్పకపోతే అక్కడితో ఆగిపోతుంది. ఈ నెల 21 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఒక్క రోజు ముందుగా సిలబస్​పై తుది నిర్ణయం వెలువడనుంది.

తప్పుగా చిత్రీకరించారు         ​ ​

డిగ్రీ ఇంగ్లిష్​ ఆనర్స్​ సిలబస్​లో ఈ ఫిక్షన్​ స్టోరీని పెట్టడంపై స్టాండింగ్​ కమిటీ మెంబర్​ రసల్​ సింగ్​ అభ్యంతరం తెలిపారు. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహ విద్యాలయను ఈ కథలో తప్పుగా చిత్రీకరించారు. అక్కడ పాఠాలు చెప్పేవాళ్లను గుజరాత్​ అల్లర్లకు పాల్పడ్డ హంతకులు​గా చూపారు. స్టోరీ కంటెంట్​ని పున: పరిశీలన చేయాల్సి ఉందని స్టాండింగ్​ కమిటీలోని మరో సభ్యుడు రాజేశ్​ ఝా చెప్పారు. యూనివర్సిటీ సిలబస్​ రివిజన్​ వ్యవహారం ఇటీవలి కాలంలో అభ్యంతరకరమైన విధంగా సాగుతోందని ఆయన విమర్శించారు. దీనివల్ల తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో సిద్ధాంతపరమైన విభేదాలు తలెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

గోద్రా ఘటన

2002 ఫిబ్రవరి 27న గుజరాత్​లోని గోద్రా రైల్వే స్టేషన్​ వద్ద సబర్మతి ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలు తగలబడింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు కాలిబూడిదయ్యారు. ఈ మృతుల్లో ఎక్కువ మంది అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలం వద్ద కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులే. దీనికి సంబంధించి 31 మంది ముస్లింలను నేరస్థులుగా కోర్టు తేల్చింది. అయితే, మంటలకు అసలు కారణం ఏంటనేది ఇంకా తేల్లేదు. ఈ ఇన్సిడెంటే తదనంతరం జరిగిన గుజరాత్ అల్లర్లకు కారణమని చెబుతుంటారు.