యూట్యూబర్​ : టిక్‌‌‌‌‌‌‌‌టాక్​లో వైరల్​.. కామెడీతో పాపులర్!​​

యూట్యూబర్​  : టిక్‌‌‌‌‌‌‌‌టాక్​లో వైరల్​.. కామెడీతో పాపులర్!​​

తల్లిదండ్రులు అతన్ని ఇంజనీర్​ని చేయాలి అనుకున్నారు. అతనికేమో కామర్స్​ అంటే ఇష్టం. అందుకే ఎంబీఏ చేశాడు. చివరకు కామర్స్​ కంటే కంటెంట్​ క్రియేట్​ చేయడంలోనే మజా ఉందని నమ్మాడు. అందుకే టిక్​టాక్​లో వీడియోలు చేశాడు. అందులో స్టార్​గా ఎదిగేలోపే ఇండియాలో బ్యాన్​ అయ్యింది. అయినా.. వెనకడుగు వేయకుండా యూట్యూబ్​లో కామెడీతో నవ్వించడం మొదలుపెట్టాడు దుష్యంత్​ కుక్రేజా. అతని కంటెంట్‌‌‌‌‌‌‌‌తో టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌ ఫాలోవర్స్​నే కాదు.. కొత్తగా కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

దుష్యంత్ కుక్రేజా 1998 మార్చి 8న హర్యానాలోని హిసార్‌‌‌‌‌‌‌‌లో పుట్టాడు. సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పెరిగాడు. తల్లి టీచర్, తండ్రి బ్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. వాళ్లు దుష్యంత్​ని ఇంజనీర్​ని చేయాలని కలలు కన్నారు. అతను కూడా చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు. పదో తరగతిలో 90 శాతం మార్కులు వచ్చాయి. 

ఇంజనీరింగ్ చేయడం ఇష్టంలేక కామర్స్ విభాగంలో 12వ తరగతి చదివాడు. అందులో కూడా 87 శాతం మార్కులు సాధించాడు. తర్వాత చండీగఢ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. అక్కడ చదువుకుంటున్నప్పుడే అతనికి కంటెంట్ క్రియేషన్​ మీద ఆసక్తి పెరిగింది. అప్పటినుంచే ఇమిటేషన్​ వీడియోలు, ఫ్రెండ్స్​తో కలిసి చిన్న చిన్న కామెడీ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.  

టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌ స్టార్​

దుష్యంత్ 2018లో షార్ట్-వీడియో ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌లో తన కామెడీ కంటెంట్​ అప్​లోడ్​ చేయడం మొదలుపెట్టాడు. లిప్-సింక్ వీడియోలు, డ్యాన్స్ క్లిప్​లు బాగా గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా అతని ఎక్స్​ప్రెషన్స్​కి చాలామంది ఫ్యాన్స్​ అయ్యారు. సోషల్​మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్​ వచ్చింది. 2019 నాటికి టిక్‌‌‌‌‌‌‌‌టాక్ స్టార్​గా పేరు తెచ్చుకున్నాడు. 

అంతలోనే మన దేశంలో టిక్‌‌‌‌‌‌‌‌టాక్‌‌‌‌‌‌‌‌ను బ్యాన్ అయ్యింది. అప్పటికే అతనికి దాదాపు 2.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రెండేండ్లు పడిన కష్టమంతా వృథాగా పోయింది. అయితే.. దుష్యంత్​ 2015 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోనే యూట్యూబ్​లో ‘దుష్యంత్​ కుక్రేజా’ పేరుతో చానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. కానీ.. పెద్దగా కంటెంట్​ అప్​లోడ్​ చేయలేదు. టిక్​టాక్​ బ్యాన్​ తర్వాత 2020లో తిరిగి యూట్యూబ్​లోనే కామెడీ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. 

యూట్యూబ్​లో  క్రేజ్​ 

దుష్యంత్​ యూట్యూబ్​కి మారిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మొదట్లో అప్​లోడ్ చేసిన వీడియోలకు పెద్దగా వ్యూస్‌‌‌‌‌‌‌‌ రాలేదు. అందుకే గతంలో టిక్​టాక్​లో అప్​లోడ్​ చేసిన పాత వీడియోలనే మళ్లీ యూట్యూబ్​లో అప్​లోడ్​ చేశాడు. అప్పటినుంచి వ్యూస్​ పెరిగాయి. తన టిక్​టాక్​ ఫ్యాన్స్​ కూడా తనలాగే యూట్యూబ్​కి మారి.. దుష్యంత్​ చానెల్​ని సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. ఇక 2020లో బాగా పాపులరైన యూట్యూబ్ ‘షార్ట్స్’  ఫీచర్​ అతనికి మరింత సక్సెస్​ని తీసుకొచ్చింది. ఎందుకంటే దుష్యంత్ షార్ట్‌‌‌‌‌‌‌‌ వీడియోలు చేయడంలో ఎక్స్​పర్ట్‌‌‌‌‌‌‌‌. 2021 మేలో అతను చేసిన ఒక షార్ట్స్ వీడియో బాగా వైరల్​ అయ్యింది. 

దానికి ఏకంగా 100 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. ఆ వీడియో వల్ల ఒకే రాత్రిలో చానెల్​ను లక్ష మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్​ చేసుకున్నారు. ఆ తర్వాత నెలలోనే మిలియన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లను సాధించాడు. ప్రస్తుతం అతని చానెల్​కు 48 మిలియన్ల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు ఉన్నారు. దాంతో భారతదేశంలో అతిపెద్ద యూట్యూబర్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటివరకు చానెల్​లో 1400 వీడియోలు అప్​లోడ్​ చేశాడు.

ఆకట్టుకునే కంటెంట్

దుష్యంత్ కుక్రేజాని సోషల్​ మీడియాలో ప్రత్యేకంగా నిలిపేది అతని కంటెంట్ స్టైల్​. ప్రతి వీడియోలో ఒక కొత్త స్టైల్​ కామెడీతో నవ్విస్తాడు. అందుకే వీడియోలు మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తాయి. ముఖ్యంగా డైలీ రొటీన్​, కుటుంబ సంబంధాలు, స్నేహాలు, హాబిట్స్​... ఇలా రకరకాల థీమ్స్​తో కామెడీ చేస్తుంటాడు.  ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’  లాంటి ప్రముఖ టీవీ షోలను పేరడీ చేయడం, హర్యానా సంస్కృతిపై స్కిట్స్​ చేయడం లాంటి వాటివల్ల దుష్యంత్​కి అన్నిరకాల ఆడియెన్స్​ నుంచి ఆదరణ పెరిగింది. .

చానెల్​ సక్సెస్​లో అతని చెల్లెలు ప్రియాల్ కుక్రేజాది కూడా కీ రోల్ ఉంది. ఆమెతో కలిసి చేసిన వీడియోలకు చాలా వ్యూస్​ వస్తుంటాయి. దుష్యంత్ ఒక్కోసారి లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ వ్లాగ్స్​, రియాక్షన్ వీడియోలు కూడా చేస్తుంటాడు. అతనికి యూట్యూబ్​తోపాటు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో కూడా బాగానే ఫాలోయింగ్​ ఉంది. ప్రస్తుతం  మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. 

సంపాదన 

యూట్యూబ్​ అతనికి అభిమానులనే కాదు కావాల్సినంత డబ్బుని కూడా ఇచ్చింది. కేవలం యూట్యూబ్​ నుంచే అతనికి నెలకు రూ. 4 నుంచి 5 లక్షల మధ్య వస్తుందని అంచనా.  దాంతోపాటు  బ్రాండ్ ప్రమోషన్స్​ కూడా చేస్తుంటాడు. వీటిద్వారా కూడా ప్రతినెలా లక్షల్లో సంపాదిస్తున్నాడు.