అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాయంకాలం దర్బారు సేవలో భాగంగా అమ్మవారికి నవదుర్గ అలంకారంతో కొలువు నిర్వహించి కుమారి, సువాసిని పూజలు, మహా మంగళ హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. జోగులాంబ అమ్మ వారు 9వ రోజు శుక్రవారం సిద్దిధాత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రి మహర్నవమి సందర్భంగా కాళరాత్రి పూజ నిర్వహించారు.
ఆలయాలను దర్శించుకున్న కలెక్టర్
జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని గద్వాల కలెక్టర్ సంతోష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సినీ నటుడు టార్జాన్(లక్ష్మీనారాయణ) తదితరులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ప్రధాన అర్చకుడు ఆనంద శర్మ, అర్చకులు వారికి స్వాగతం పలికారు. కలెక్టర్ స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు.
ఆలయాల్లో భక్తుల సందడి..
జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు శుక్రవారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
నేడు తెప్పోత్సవం..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం విజయదశమి సందర్భంగా జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఉదయం 8 గంటల నుంచి మహా పూర్ణాహుతి, సాయంత్రం 4 గంటలకు శమీ పూజ, యోగానరసింహ స్వామి ఊరేగింపు, సాయంత్రం 6:30 కు నదీ హారతి,7 గంటలకు తెప్పోత్సవం, ధ్వజారోహణ నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.