దసరా ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మైసూర్ ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ. మైసూర్ కు 10 కిలో మీటర్ల దూరంలో ఉండే నాజరాబాద్ ఊళ్లో దసరా వేడుకల సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటుంది.
అక్కడ 'దసరా బొమ్మలు' ఎంతో ప్రత్యేకం. నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసిన బొమ్మలను పూజిస్తారు. దసరా అంటే రాక్షసులపై దుర్గామాత విజయాన్ని సూచిస్తుంది. మహారాజుల కాలం నుంచి నిర్వహించే పండుగ. దీని చిహ్నంగా నాజర్ బాద్ లో వారసత్వ బొమ్మలను తయారు చేస్తారు. ఇందులో భారతీయ సంస్కృతి గొప్పదనం, మహారాజుల వైభవం గొప్పగా కనిపిస్తుంది.
ఈ బొమ్మలను భక్తులకు అమ్ముతారు కూడా. మైసూర్ ప్యాలెస్ లో వీటిని అమ్మడానికి ప్రత్యేకంగా 'డాల్ హౌస్' కూడా ఉంది. ఈ బొమ్మల సంస్కృతి విజయనగర సామ్రాజ్య కాలంలో మొదలైంది. దసరా బొమ్మలు కర్ణాటకలోని చాలా ఇళ్లలో, ముఖ్యంగా దసరా పది రోజుల్లో కనిపిస్తాయి. వివిధ వృత్తుల్లో ఉన్న వ్యక్తులను, రాజులను, దేవతలను, పురాణాల పాత్రలను బొమ్మతో కలిపి థీమెటిక్ గా తయారు చేస్తారు.
'ఈ బొమ్మలు ప్రజల సంస్కృతిని సూచిస్తాయి. వృత్తులు, దేవతలు, చారిత్రక సంఘటనల వినోదాలతో సహా అన్నీ కనిపిస్తాయి' అంటున్నారు బెంగళూర్ చరిత్రకారులు.
చెన్నై బొమ్మల కొలువు..
దసరా రోజు చెన్నై వెళ్తే.. బొమ్మల కొలువులను చూడొచ్చు.. అక్కడ ఈ వేడుకల్లో భాగంగా చెక్క అల్మారాల్లో దేవుడి బొమ్మలను అందంగా అలంకరిస్తారు. ఇందులో కూడా ప్రత్యేకమైన థీమ్‌లు ఉంటాయి. రామాయణం, మహాభారతం థీమ్‌లలో బొమ్మలను ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో కూడా పోటీ పెడతారు. ఇక్కడ ఈ పండుగను బొమ్మై కలు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో బొమ్మల కొలువు, కర్ణాటకలో బొమ్మె హబ్బా పేరుతో ఈ పండగను చేపడుతారు.
పురాణాలు చిన్నారులకు ఈజీగా అర్థమయ్యేలా
పదిరోజుల పాటు సాగే ఈ బొమ్మల కొలువును చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసేందుకు దాదాపు నెల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు. పేపర్, చెక్క, ఇత్తడి, క్లే, పత్తి, వస్త్రం, వైర్లతో అందంగా బొమ్మలను తయారు చేస్తారు. బొమ్మల కొలువులో చివరి రోజున ఊయలలో వేసి పూజలు చేసి తీసివేస్తారు.
దసరా సమయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో దశవతారాలు, అనంత పద్మనాభ స్వామి, బకాసుర బొమ్మలతో రైతు జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. మహాభారతం, రామాయణంలోని పాత్రలను సైతం ఈ బొమ్మల కొలువులో ఉంచుతారు. చిన్నారులకు మన పురాణగాథలు సులభంగా అర్థమయ్యేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు.
బొమ్మల పండుగ చరిత్ర..
పురాణాల ప్రకారం.. దుర్గాదేవి మహిషాసురడిని సంహరించేందుకు దేవతలు ఆమెకు అన్ని శక్తులను ఇచ్చారు. ఈ సమయంలో దేవతలు బలహీనులుగా మారారు. అయితే మహిషాసురుడిపై అమ్మవారు పదోరోజు విజయం సాధించారు. ఆత్మబలిదానానికి గౌరవంగా ఇవ్వడానికి బొమ్మల పండుగను దేవతలను బొమ్మల రూపంలో పూజిస్తారు. ఈ ఆచారం విజయనగర రాజ్యం ఉనికిలో ఉన్నప్పటి నుంచి ప్రబలంగా ఉందని చాలా మంది నమ్ముతారు.
బొమ్మల పండుగ ప్రాముఖ్యత..
ఈ బొమ్మల పండుగను ఎక్కువగా కర్నాటకలో ఘనంగా జరుపుకుంటారు. కొత్త తరం భూమి గొప్ప కల్చర్, పురాణాలను పరిచయం చేస్తుంది. దసరా పండుగ సందర్భంగా దైవిక ఆశీర్వాదం పొందడం, పిల్లలను అలరించడం కూడా ఒక మార్గం. అయితే సాంప్రదాయ బొమ్మల తయారీ రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. దసరా పండుగ సమయంలో బంకమట్టి బొమ్మల తయారీని సజీవంగా ఉంచడాన్ని ప్రోత్సహిస్తుంది.