ఉమ్మడి వరంగల్​జిల్లా దసరా సంబురం

ఉమ్మడి వరంగల్​జిల్లా దసరా సంబురం

ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున నిర్వహించిన ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.  ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం జమ్మి కోసం ఊరంతా కలిసి వచ్చి పూజలు చేసి, జమ్మిని తీసుకుని అలైబలై ఇచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

ఈ సందర్భంగా పలుచోట్ల క్రీడాపోటీలు, బతుకమ్మ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఆయా చోట్ల రావణదహనం కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరంగల్ సిటీలోని ఉర్సు రంగలీల మైదనం, రంగశాయిపేట మహంకాళీ ఆలయం, చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద జరిగిన రావణసురవధ వేడుకలకు మంత్రి కొండా సురేఖ ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. 38 ఏండ్లుగా కాశీబుగ్గ దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శ్వాశత స్థలం ఏర్పాటు చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. 

భద్రకాళి అమ్మవారి సన్నిధిలోని తెప్పోత్సవానికి హాజరైన మంత్రి కొండా సురేఖకు రాష్ర్ట మైనార్టీ నాయకుడు మహ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు బంగారు జమ్మి ఆకులను అందజేశారు. ములుగు సాధనా స్కూల్ సమీపంలో ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణాసురవధ కార్యక్రమానికి రాష్ర్టీయ సేవికా సమితి జిల్లా ప్రముఖ్​, ఉపాధ్యాయురాలు వాంకుడోతు జ్యోతి, జిల్లా సీనియర్​ సివిల్ జడ్జి టి.కన్నయ్యలాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లాకు చెందిన బీట్ బాక్సర్​ పొన్నం రాణా ప్రతాప్, బొమ్మతో మిమిక్రీ చేసిన ప్రతీక్​, మ్యూజిక్​ డైరెక్టర్​ పూర్ణాచారి, రేలా విజయ్ ప్రదర్శనలు​, కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి. - కాశీబుగ్గ/ వరంగల్,  ఖిలా వరంగల్( కరీమాబాద్​)పర్వతగిరి/ నర్సంపేట/  ములుగు/ మహబూబాబాద్​అర్బన్/ గూడూరు/ తొర్రూరు/ కురవి, వెలుగు