- పండగ వేళ ఉమ్మడి జిల్లా ఆర్టీసీకి ఒక్క రోజే రూ.88 లక్షలకు పైగా ఆదాయం
- 11 రోజుల్లో రూ.123 కోట్ల ఆబ్కారీ సేల్స్
- ఒక్కరోజే రూ.47.13 కోట్ల మందు తాగిన మద్యంప్రియులు
నల్గొండ, వెలుగు : దసరా పండగ సర్కారుకు కాసులు కురిపించింది. ఆర్టీసీ, ఎక్సైజ్ శాఖలకు దసరా పండగ భారీగా లాభాలను తెచ్చి పెట్టింది. దసరా, బతుకమ్మ పండుగలు లిక్కర్ బిజినెస్ కు బాగా కలిసొచ్చాయి. ఈనెల 1 నుంచి 11 వరకు రూ.123.23 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. దీంట్లో లిక్కర్ 1,21,634 పెట్టెలు అమ్ముడు పొగా, బీర్లు 2,09,616 పెట్టెలు అమ్ముడయ్యాయి. 2023 అక్టోబర్ లో మొత్తం మీద రూ.331.87 కోట్లు సేల్స్ జరిగితే ఈసారి కేవలం 11 రోజుల్లోనే రూ.123.23 కోట్ల ఆదాయం సర్కారుకు వచ్చింది.
ఇదిలా ఉండగా కేవలం దసరా పండగ ఒక్కరోజే రూ.4713 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఆదివారం జరిగిన సేల్స్ లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 33,275 మద్యం కాటన్లు, 41,800 బీర్ కాటన్లు అమ్మినట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 11,927 లిక్కర్ కాటన్లు, 14, 687 బీర్ కాటన్ల విక్రయాలు జరిగాయి.
ఆర్టీసీకి రూ.88 లక్షలకు పైగా ఆదాయం..
దసరా పండగ పురస్కరించుకొని ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, మినీ డీలక్స్ బస్సులను పెద్ద సంఖ్యలో నడిపింది. నల్లగొండ రీజినల్ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో ఏడు బస్ డిపోలు ఉండగా, 482 కు పైగా బస్సులను నడిపాయి. దీంతో దసరా ఒక్క రోజే భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.
దసరా రోజు 1,49, 844 కిలో మీటర్ల మేరకు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించగా, అదనంగా 55,167 కిలో మీటర్లు నడిపింది. దీంతో ఆర్టీసీకి రీజినల్ పరిధిలో రూ.88,49,295 ఆదాయం సమకూరింది. నల్లగొండ డిపోలో రూ.12.38, 262, సూర్యాపేట డిపోకు రూ.14 లక్షలు, దేవరకొండ డిపోకు రూ.19,97,219, నార్కెట్ పల్లి డిపోకు రూ.71, 487, మిర్యాలగూడ డిపోకు రూ.14,61,999, యాదగిరిగుట్ట డిపోకు రూ.16,07,537, గుట్ట పైకి జీరో టిక్కెట్లు ద్వారా రూ.13,79,537 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.