ఆదిలాబాద్ లో ఘనంగా దసరా వేడుకలు.. అబ్బురపర్చిన రాంలీల

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: దసరా పండుగ వేడకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామాలు, పట్టణాలు, సింగరేణి  కార్మిక ప్రాంతాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్​లో నిర్వహించిన రావణ దహనానికి జనం వేలాదిగా తరలివరాడంతో గ్రౌండ్​ కిక్కిరిసిపోయింది. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్ ​బాల్క సుమన్​పూజలు చేసి స్వామివారిని పల్లకిలో గ్రౌండ్​కు తీసుకరావడంతో  సంబురాలు ప్రారంభమయ్యాయి.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, రాంలీలా మైదానంలో హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ధస్నాపూర్​లో ఎమ్మెల్యే జోగురామన్న, రాంలీల మైదానంలో మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ రావణ దహనం చేశారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో స‌తీమ‌ణి సాయిమౌనారెడ్డితో క‌లిసి ఆయుధ‌, వాహ‌న పూజ‌లు చేశారు. నిర్మల్​లోని బంగాల్ పేట్ మహాలక్ష్మి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు. దసరా వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సింగరేణి తిలక్ క్రీడా మైదానంలో రావణ వధ కార్యక్రమాన్ని  ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల పూజలు అందుకొన్న దేవి నిమజ్జన వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. శారద గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖానాపూర్​లో ఎమ్మెల్యే రేఖా నాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,  హిందూ ఉత్సవ  సమితి అధ్యక్షుడు ఎం.సురేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను షురూ చేశారు.