యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆలయంలో అమ్మవారికి ఉదయం ప్రాతఃకాల పూజ, స్థాపిత దేవతా హవనం, అర్చనలు, పారాయణాలు, గాయత్రీ జపాలు, లలిత సహస్రనామార్చనలు నిర్వహించారు. సాయంత్రం చతుషష్టి ఉపచార పూజ, సహస్రనామార్చనలు, నీరాజన మంత్ర పుష్పములు, సువాసినీ పూజలు చేశారు.