బతుకమ్మ పండుగ సంబురాల్లో ఉండంగనే దసరా హడావిడి మొదలైంది. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి మూడు రోజులు అమ్మవారికి పూజలు జేస్తరు. చల్లగ సూడమని కోరుకుంటరు. రకరకాలు వండి నైవేద్యంగ పెడతరు. దసరా రోజైతే యాట కోసి మటన్ వండుకుంటరు.ఈ సారి ఈ స్పెషల్ వెరైటీలు చేసుకుని. దసరాను ఇంకా.. స్పెషల్‌గ జరుపుకోండి.
పటిక బెల్లం పరమాన్నం
కావాల్సినవి:
బియ్యం – అరకప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు
పాలు – రెండు కప్పులు, పటిక బెల్లం– ఒక కప్పు, యాలకులు – మూడు, కుంకుమపువ్వు – కొద్దిగా, నెయ్యి– కొద్దిగా, జీడిపప్పు – కొద్దిగా, తయారీ: బియ్యాన్ని బాగా కడిగి కుక్కర్‌లో వేసి, నీళ్లు పోయాలి. కుక్కర్ మూతపెట్టి ఒక మాదిరి మంట మీద మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఒక గిన్నెలో పాలుపోసి మరిగించాలి. తర్వాత ఉడికించిన బియ్యాన్ని పాలల్లో వేసి పావుగంట ఉడికించాలి. పటిక బెల్లం పొడివేసి బాగా కలపాలి. యాలకుల పొడి, కుంకుమపువ్వు వేయాలి. ఒక కడాయిలో నెయ్యి కరిగించి జీడిపప్పు వేగించి పరమాన్నంలో కలపాలి.
పన్నీర్ పాయసం
కావాల్సినవి:
నెయ్యి : కొద్దిగా, జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్ – కొద్దిగా
పాలు – మూడు కప్పులు, చక్కెర – పావుకప్పు, పన్నీర్ తరుగు– అరకప్పు, యాలకుల పొడి – పావుస్పూన్
తయారీ: కడాయిలో నెయ్యి వేడి చేసి బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ వేగించాలి. తర్వాత పాలుపోసి కలుపుతూ పాలు సగమయ్యే వరకు మరిగించాలి. చక్కెర కరిగాక, పన్నీర్ తరుగు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. యాలకుల పొడివేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. పాయసాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేస్తే పన్నీర్ పాయసం రెడీ.
పటిక బెల్లం బోండాలు
కావాల్సినవి:
మినపప్పు – ఒక కప్పు
బియ్యం – రెండు టేబుల్ స్పూన్లు
పటిక బెల్లం – ముప్పావు కప్పు
నూనె – వేగించేందుకు సరిపడా
తయారీ: బియ్యం, మినపప్పును శుభ్రంగా కడిగి ఐదు గంటలు నానబెట్టాలి. మిక్సీజార్‌లో పటికబెల్లం పొడిచేయాలి. మినపప్పును మెత్తగా మిక్సీ పట్టాలి. దాంట్లో పటిక బెల్లం పొడివేసి కలపాలి. ఒక కడాయిలో నూనె వేడిచేసి పిండిని బోండాలుగా వేసి ఎర్రగా వేగిస్తే తియ్య తియ్యటి క్రిస్పీ పటిక బెల్లం బోండా రెడీ.
బాదం మిల్క్ పూరీ
కావాల్సినవి:
బాదం – పది
పాలు – ఒక లీటర్
చక్కెర – ఒక కప్పు
ఆల్మండ్ ఎసెన్స్ – రెండు చుక్కలు
యాలకులు – రెండు
గోధుమపిండి– ఒక కప్పు
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
నీళ్లు– తగినన్ని
నూనె – వేగించుకునేందుకు సరిపడా
తయారీ: ఒక గిన్నెలో గోధుమపిండి, నెయ్యి వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. బాదంపప్పుని గంటసేపు నానబెట్టి తొక్కుతీసి, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. గిన్నెలో పాలుపోసి మరిగించాలి. దాంట్లో కొద్దిగా కుంకుమపువ్వు వేయాలి. తర్వాత యాలకుల పొడి, బాదం పేస్ట్, ఆల్మండ్ ఎసెన్స్ వేసి ఇంకొంచెంసేపు కాగబెట్టాలి. చక్కెర వేసి, కరిగాక స్టవ్ ఆపేయాలి. గోధుమపిండిని పూరీలా వత్తాలి. కడాయిలో నూనె వేడిచేసి పూరీలను కాల్చాలి. కాల్చిన పూరీని ఒక గిన్నెలోకి తీసుకుని దానిపైన పాలు పోస్తే బాదంపాల పూరీ తయార్.
మటన్ కర్రీ
కావాల్సినవి:
మటన్ – అర కేజీ
నూనె – మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డలు – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ –
ఒక టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కారం – ఒక టేబుల్ స్పూన్
పసుపు – పావు టేబుల్ స్పూన్
ధనియాలపొడి –
పావు టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి –
పావు టేబుల్ స్పూన్
టొమాటోలు – రెండు
పెరుగు – ఒక కప్పు
కొత్తిమీర – కొద్దిగా
మటన్ మసాలా –
ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా – కొద్దిగా
తయారీ: కుక్కర్‌లో కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లిగడ్డ తరుగు వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేగాక మటన్ ముక్కలు వేసి కొంచెంసేపు ఉడికించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, మటన్ మసాలా వేసి అన్నీ బాగా కలిపి మూడు నిమిషాలు ఉడికించాలి. టొమాటో ముక్కలు వేసి అవి ఉడికాక పెరుగు వేసి అన్నీ బాగా కలపాలి. కుక్కర్ మూతపెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. స్టీమ్ పోయిన తర్వాత మూతతీసి.. గరంమసాలా, కొత్తిమీర వేసి దించేస్తే టేస్టీ మటన్ కర్రీ తయార్.
గోంగూర మటన్ కర్రీ
కావాల్సినవి:
మటన్ – అరకేజి
గోంగూర – రెండు కట్టలు
ఉల్లిపాయలు – నాలుగు
బిర్యానీ దినుసులు – కొద్దిగా
పసుపు – అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
నూనె – కొద్దిగా
పచ్చిమిర్చి – రెండు
కారం – మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
ధనియాలపొడి – ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి – అర టీ స్పూన్
నీళ్లు – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
తయారీ: కుక్కర్‌లో కొద్దిగా నూనె వేడిచేసి మటన్ ముక్కలు వేయాలి. కొన్ని ఉల్లిగడ్డలు, బిర్యానీ దినుసులు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ బాగా కలపాలి. కుక్కర్ మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఒక బాండీలో గోంగూర ఉడికించి చల్లార్చాలి. దాంట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిగడ్డలు ఎర్రగా వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌వేసి వేగించాలి. గోంగూర పేస్ట్ వేసి ఉడికించాక ఉడికించిన మటన్ వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. తరువాత కారం, ఉప్పు, ధనియాలపొడి, జీలకర్ర వేసి కలిపి, కొన్ని నీళ్లు పోసి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత గరంమసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గోంగూర మటన్ కర్రీ తయార్.