పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేపట్టినప్పుడు... పాలకడలి నుంచి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు పుట్టాయట. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఉంది. ఇంతకుముందు యజ్ఞ యాగాల్లో జమ్మి చెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవాళ్లట. అలాగే వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. రావణుడితో యుద్ధానికి ముందు జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజించాడు. తిరిగి అయోధ్యకి వెళ్లేటప్పుడు కూడా జమ్మి చెట్టుకు పూజలు చేశాడు. మహా భారతంలో అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ బట్టల్ని, ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి ఉంచారు పాండవులు. అజ్ఞాత వాసం ముగిశాక జమ్మి చెట్టుకి పూజలు చేసి ఆయుధాల్ని దించి కౌరవ సేనని తరిమికొట్టారు. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే విజయదశమి రోజు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలుస్తారు అంతా. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటూ అలయ్– బలయ్ చేసుకుంటారు. పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.
ఆయుధ పూజ
మహాభారతంలో పాండవులు జమ్మిచెట్టు పై నుంచి ఆయుధాల్ని దించి పూజించారట.. ఆనాటి నుంచి తరతరాలుగా ఆయుధపూజ ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజు పిల్లల పుస్తకాల నుంచి రైతుల నాగళ్ల దాకా.. సైకిల్ నుంచి యుద్ధ విమానాల దాకా , కూలీ పనులు చేసేవాళ్లు, కులవృత్తుల వాళ్లు, వ్యాపారులు...అందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాల్ని పూజించి గౌరవిస్తారు. అలాగే సైకిల్ నుంచి ట్రాక్టర్ వరకు అన్ని వాహనాలకు పూజలు చేస్తారు.