మంచిర్యాల–చంద్రపూర్​హైవేకు ఇరువైపులా ఫ్యాక్టరీలు 

  • వీటి నుంచి విచ్చలవిడిగా నల్లని పొగ, దుమ్ము 
  • పట్టించుకోని పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగతో పత్తిపంటపై తీవ్ర ప్రభావం పడుతోంది. చెట్ల ఆకుల మీద దుమ్ము, పొగ, కెమికల్స్​ తెల్లటి పూత పూసినట్లు పేరుకుపోతున్నాయి. మంచిర్యాల-– చంద్రాపూర్(మహారాష్ట్ర) నేషనల్​ హైవే 363కు ఇరువైపులా పులిమడుగు నుంచి అందుగులపేట, ఊరుమందమర్రి వరకున్న సిరామిక్స్​ కంపెనీలు, రైస్​మిల్స్, వెస్ట్​ పేపర్​మిల్ ​నుంచి వెలువడే  కెమికల్స్​ పొగతోపాటు నిర్మాణంలో ఉన్న నేషనల్​ హైవే  నుంచి  నిత్యం వెలువడుతున్న దుమ్ము, ధూళి పత్తితో పాటు చెట్ల ఆకులపై పేరుకుపోతోంది.

దీంతో పత్తి చేన్లు తెల్లరంగులోకి మారుతున్నాయి. సిరామిక్స్​ కంపెనీల నుంచి చెడువాసనతో కూడిన నల్లని పొగ, దుమ్ము కారణంగా పత్తితోపాటు ఇతర పంటలకు నష్టం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని ఎన్ని సార్లు పొల్యూషన్​ కంట్రోల్ ​బోర్డు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగు మారిన పత్తిని మార్కెట్​లో అమ్ముకోవడం కష్టంగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా కాలుష్య ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.