కలెక్టరేట్​లో పాతుకుపోయిన్రు..నాలుగైదేండ్లుగా ఒకే చోట డ్యూటీ

  • రెవెన్యూలోని కీలక విభాగాల్లో వారిదే హవా
  • అవినీతి ఆరోపణలు వస్తున్నా కదలని ఆఫీసర్లు 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్​లోని పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు ఏండ్లుగా అక్కడే పాతుకుపోయారు. గత నాలుగేండ్లలో చాలామంది ఆఫీసర్లకు ట్రాన్స్​ఫర్లు జరిగినప్పటికీ కొందరు మాత్రం దర్జాగా అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఏండ్లుగా ఒకే పోస్టులో తిష్టవేయడం వల్ల వారి కింద పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇక్కడ అక్రమాలు.. హైదరాబాద్​లో ఆస్తులు 

కలెక్టరేట్​లోని సీ సెక్షన్​ ద్వారా భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులు జరుగుతాయి. ఈ సెక్షన్​లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి ఓపెన్ ​కాస్ట్​ ప్రాజెక్టులు, నేషనల్​ హైవేలు, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. అడ్డదారిలో సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్​లో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. అవినీతి విషయమై గతంలో పనిచేసిన కలెక్టర్ ఆయనను హెచ్చరించినట్టు సమాచారం. అయినా ఆయన తీరు మారలేదు. ఇటీవల కలెక్టరేట్​లోని సీనియర్ ​అధికారులు ట్రాన్స్​ఫర్​ కావడంతో ఇప్పుడు సదరు అధికారిదే హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరైనా అధికారులు కలెక్టర్​ను కలవాలంటే పర్మిషన్​ తీసుకొని వెళ్లాలి.  కానీ ఆయన మాత్రం ఎప్పుడంటే అప్పుడు నేరుగా కలెక్టర్ ​చాంబర్​లోకి వెళ్లేంత ‘పరపతి’ సంపాదించుకోవడం విశేషం. వివిధ డిపార్ట్​మెంట్లలో పలువురు ఉద్యోగులు సైతం కొంత మంది అధికారుల అండతో నాలుగైదు సంవత్సరాలుగా కుర్చీలను పట్టుకొని వేలాడుతున్నారు. ఇలాంటి ‘లాంగ్ ​స్టాండింగ్’​ అధికారులు, ఉద్యోగులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. 

సీ, డీ సెక్షన్లలో ఏండ్లుగా..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత నెలలో జిల్లా వ్యాప్తంగా 18 మంది తహసీల్దార్లను ట్రాన్స్ ఫర్​ చేశారు. ఏ, బీ సెక్షన్లలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను సైతం బదిలీ చేశారు. కానీ వారికంటే ముందు నుంచి సీ, డీ సెక్షన్లలో కీలక స్థానాల్లో కొనసాగుతున్న అధికారులను మాత్రం కదిలించలేదు. భూసంబంధ వ్యవహారాలన్నీ డీ సెక్షన్​ ద్వారా సాగుతుండడంతో అవినీతికి ఆస్కారం ఉంది. ఇదే అదునుగా సదరు అధికారి చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గతంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పనిచేస్తున్నప్పుడు సదరు అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడని, ఆయినా తీరు మారలేదని డిపార్ట్​మెంట్​లో గుసగుసలాడుకుంటున్నారు. కలెక్టరేట్​లో పనిచేసే పలువురు అధికారులు, సిబ్బంది విషయాలు ఉన్నతాధికారులకు చేరవేస్తూ వారికి దగ్గరైనట్లు చర్చించుకుంటున్నారు. దీంతో సదరు ఆఫీసర్ బదిలీ కాకుండా అక్కడే పాతుకుపోయాడు.