ఆగి ఉన్న కారును ఢీకొట్టిన దివ్వల మాధురి.. తలకు గాయాలు

ఆగి ఉన్న కారును ఢీకొట్టిన దివ్వల మాధురి.. తలకు గాయాలు

ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటిపోరు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా దువ్వాడ, ఆయన సతీమణి వాణి, ఆయనతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దువ్వాడను డబ్బు కోసం మాధురి ట్రాప్ చేసిందని భార్య వాణితో పాటు వారి ఇద్దరు కుమార్తెలు ఆరోపిస్తుండగా.. అవన్నీ అవాస్తవాలని మాధురి కొట్టి పారేస్తోంది. తమ బంధం అక్రమ సంబంధం కాదని బదులిస్తోంది.

ఇదిలావుండగా, దివ్వల మాధురి ప్రయాణిస్తున్న కారుకు రోడ్డు ప్రమాదానికి గురైంది. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమెకు తలకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారును ఆమే డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగినది కాదని, తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు మాధురి తెలిపింది. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక వేగంగా కారును ఢీకొట్టి చనిపోవాలనుకున్నట్లు ఆమె వెల్లడించింది. తనపై, తన పిల్లలపై వస్తోన్న ట్రోల్స్‌ తట్టుకోలేకపోతున్నానంటూఆమె కంటతడి పెట్టుకుంది. వైద్యం వద్దంటూ మొండికేస్తుంది. విషయం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఆమె చికిత్స పొందుతోన్న ఆస్పత్రికి బయలుదేరినట్లు తెలుస్తోంది.