అమరావతి: టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనుపై వైసీపీ అధిష్ఠానం వేటేసింది. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి దువ్వాడను తప్పించి ఆ బాధ్యతలను పేరాడ తిలక్కు జగన్ అప్పగించారు. ఇంట గెలిచి రచ్చ గెలవమని అంటుంటారు. కానీ.. దువ్వాడ శ్రీను ఇంటా ఓడారు. రచ్చా ఓడారు. దువ్వాడ శ్రీనుకు ఆయన భార్య దువ్వాడ వాణి నుంచి రాజకీయంగా, కుటుంబపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురయిన విషయం తెలిసిందే. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన దువ్వాడ శ్రీను టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు.
ఈ మధ్య దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి పేర్లు సోషల్ మీడియాలో మోత మోగిన సంగతి తెలిసిందే. దివ్వెల మాధురి ఇన్స్టాగ్రాం వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ వీడియోలను మీడియా ప్రసారం చేసింది. ఆమె ఇంటర్వ్యూ వీడియోలు ట్రెండ్ అయ్యాయి. దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి గురించి వైసీపీ, టీడీపీ మధ్య విమర్శలుప్రతివిమర్శల వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీను వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటి ముందు ఆయన భార్య వాణి, కుమార్తెలు నవీన, హైందవి ఆగస్ట్ 8న నిరసనకు దిగడంతో ఇంటి రచ్చ రోడ్డున పడింది. కొత్తగా కట్టుకున్న ఆ ఇంట్లో దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీను ఉంటున్నాడని, తమ ఇంటికి రావడం లేదని ఆయన భార్య, కుమార్తెలు నిరసనకు దిగారు. దువ్వాడ శ్రీను ఇంటికి రావాలని కోరారు. అందుకు దువ్వాడ శ్రీను అంగీకరించకపోవడం, దివ్వెల మాధురి ఈ వివాదంపై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఈ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయింది.