Dwayne Bravo: రిటైర్మెంట్ తర్వాత బంపర్ ఆఫర్.. కోల్‌కతా మెంటార్‌గా బ్రావో

Dwayne Bravo: రిటైర్మెంట్ తర్వాత బంపర్ ఆఫర్.. కోల్‌కతా మెంటార్‌గా బ్రావో

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇంస్టాగ్రామ్ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్ 27) అన్ని రకాల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైర్మెంట్ వెంటనే బ్రావోకి బంపర్ ఆఫర్ వరించింది. ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త మెంటార్‌గా ఈ విండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ ను ఎంపిక చేశారు. గంభీర్ స్థానంలో బ్రావో తన బాధ్యతలు స్వీకరిస్తాడు. 2024లో గంభీర్ మెంటార్ గా కేకేఆర్ టైటిల్ గెలిచింది. మరోవైపు బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ నుంచి తప్పుకోని కేకేఆర్ జట్టుతో చేరనున్నాడు. 

బ్రేవో కేకేఆర్ మెంటార్ పదవిని చేపట్టడానికి ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్‌ను కలిసినట్టు నివేదికలు చెబుతున్నాయి. విదేశీ లీగ్ ల్లో నైట్ రైడర్స్ జట్లు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, అబుదాబి నైట్ రైడర్స్ కు బ్రావో పని చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది. "బ్రావో కేకేఆర్ జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. అతని అపారమైన అనుభవం.. అతని లోతైన జ్ఞానం.. జట్టును గెలిపించాలనే తపన ఫ్రాంచైజీకి ఎంతో మేలు చేస్తుంది". అని కేకేఆర్ సీఈఓ తెలిపారు.

2006 నుంచి టీ20 క్రికెట్ ఆడుతున్న బ్రావో ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బ్రావో 582 మ్యాచుల్లో 631 వికెట్లు తీశాడు. బ్రావో 2021లో తన అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు ఆడుతూ బిజీ అయ్యాడు. 2023 లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌ అవతారమెత్తాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 40 టెస్టులు.. 164 వన్డేలు.. 91 టీ20 మ్యాచ్ లాడాడు. అన్ని ఫార్మాట్ లలో మొత్తం 363 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్ గాను సత్తా చాటి 10000 కు పైగా పరుగులు చేశాడు. 161 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 4360 పరుగులతో పాటు.. 183 వికెట్లు పడగొట్టాడు.