-
జపాన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
-
2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ టార్గెట్
-
పెద్ద సంఖ్యలో పవర్ కన్వర్టర్లు, సెమీ కండక్టర్లు అవసరమని వెల్లడి
-
రోహ్మ్ , పానాసోనిక్ కంపెనీలను సందర్శించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకు రావాలని జపాన్కంపెనీలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం గురువారం క్విటో నగరానికి సమీపంలోని ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ ను సందర్శించారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సెమీకండక్టర్ల అవసరం ఉందని, ఈ ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యాన్ని కోరారు.ఈ సందర్భంగా రోహ్మ్ సంస్థ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధికారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకాషీ తదితరులు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సెమీకండక్టర్ల పరిశ్రమలను, అక్కడి ఉత్పత్తి ప్రక్రియలను డిప్యూటీ సీఎంకు వివరించారు.
భారత్లో ఇప్పటికే 3 చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో సెమీకండర్ల ఇండస్ట్రీకి, వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. క్విటో సిటీకి దగ్గర్లోని పానాసోనిక్ కంపెనీని డిప్యూటీ సీఎం సందర్శించారు. ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషితో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భట్టికి వివరించారు. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని, భారతదేశంలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య పెరుగుతోందని, ఆర్టీసీ బస్సులను పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించిందని.. పానాసోనిక్ సంస్థ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయొచ్చని సూచించారు. ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామని భట్టి విక్రమార్కతెలిపారు.
భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వాదం
జపాన్లోని క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి సందర్శించారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఉన్నతాధికారులను ఆశీర్వదించారు. ఈ పర్యటనలో ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.