నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్ష లీకేజీపై తక్షణమే ప్రధాని మోదీ ప్రభుత్వం స్పందించి నిందితులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని, పేపర్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవడంలేదని ఫైర్అయ్యారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు శివ వర్మ, తారా సింగ్, నేతలు సైదులు, ఆంజనేయులు, మహేశ్, రామకృష్ణ, బాలు పాల్గొన్నారు.