ముందు ఓ బానెట్, వెనకో డిక్కీ, స్టీరింగు, యాక్సిలరేటర్, బ్రేకులు, గేర్లు, అద్దాలు తుడిచే వైపర్లు, వెనక నుంచి వచ్చే బండ్లను చూసేందుకు రేర్ మిర్రర్లు.. అన్నీ కలిపి ఓ కారు! కారంటే అలాగే ఉండాలా.. కొత్తగా ఉండకూడదా అని ఆలోచించాయి జనరల్ మోటర్స్ (జీఎం), హోండా కంపెనీలు. అవేవీ లేకుండానే ఓ ఎలక్ట్రిక్ కారును తయారు చేశాయి. దాని పేరే ఆరిజిన్. అవన్నీ లేకుండా కారెలా ముందుకెళుతుంది.. ఆగాల్సినప్పుడు బ్రేకులెట్లా వేస్తుందబ్బా అన్న డౌట్ వచ్చిందా! ఈ కారుదంతా ఆటోమేటిక్ సిస్టమే. దీన్ని నడపడానికి ప్రత్యేకంగా డ్రైవర్ కూడా అవసరం లేదు. తనంతట తానే దూసుకెళుతుంది. ఆగాల్సిన చోటు వచ్చినప్పుడు అదే ఆగిపోతుంది. అందుకు కారు లోపల మొత్తం స్విచ్‌లే ఉంటాయి. వెళ్లాల్సిన చోటును టైప్ చేసి బటన్ నొక్కేస్తే సరి. హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని దర్జాగా జర్నీ చేసేయొచ్చు. అయితే, వీటిని మనం కొనుక్కోవడానికి లేదు.
జస్ట్ క్యాబ్ యాప్స్‌లాగే రైడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ‘క్రూయిజ్’ అనే సంస్థతో కలిసి జీఎం, హోండాలు ఒప్పందం చేసుకున్నాయి. క్రూయిజ్‌లో రైడ్ బుక్ చేసుకుంటే, ఆరిజిన్ మన లొకేషన్‌కు వస్తుంది. కారు ఎక్కేందుకు, బయటి డోర్‌పై ఉండే కీప్యాడ్‌పై మనకొచ్చే కోడ్‌ను ఎంటర్ చేయాలి. కారెక్కాక దిగాల్సిన చోటును టైప్ చేసి, రైడర్స్ కోసం పెట్టే బటన్లను నొక్కేస్తే సరి. జర్నీ షురూ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నారో లేదో చూసే సెన్సర్లూ కార్లో ఉంటాయి. జీఎం సంస్థ కార్లను తయారు చేస్తే, ఆ కార్ల డిజైన్ పనిని హోండా చూసుకుంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు సెన్సర్లను క్రూయిజ్ డెవలప్ చేస్తుంది. అయితే, కమర్షియల్ ఈ కార్లు ఎప్పుడు రోడ్డెక్కుతాయన్నది మాత్రం ఆయా కంపెనీలు వెల్లడించలేదు. ఈ కారుపై దాదాపు మూడేళ్ల పాటు ఆ మూడు కంపెనీలు పనిచేశాయి. సిటీలు, హైవేల్లో ఈ కారు బాగా పనికొస్తుందని కంపెనీలు చెబుతున్నా, స్టీరింగ్, బ్రేకుల వంటివి లేకపోవడంతో నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆరిజిన్ వల్ల పర్యావరణానికి హాని జరగదని కంపెనీలు చెబుతున్నాయి.
For More News..